ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు అందరూ కృషి చేయాలె : మోడీ

ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు అందరూ కృషి చేయాలె : మోడీ

బాలి : ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలని ప్రపంచదేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అప్పటి దేశాధినేతలు చాలా ప్రయత్నాలు చేశారని, మరోసారి అలాంటి ప్రయత్నాలు రష్యా– ఉక్రెయిన్  యుద్ధం నేపథ్యంలో తప్పనిసరిగా అవసరం అని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జీ 20 కూటమి దేశాల సదస్సు కొనసాగుతోంది. బాలిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​ సహా దేశాధినేతల సమక్షంలో జీ 20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సులో బైడెన్​ ను మోడీ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. 

ఆహారం, ఇంధనంపై జరిగిన సదస్సులోనూ ప్రధాని మోడీ ప్రసంగించారు. కరోనా సంక్షోభం తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరిపై ఉందని దేశాధినేతలకు మోడీ పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల సంక్షోభం ప్రతి దేశంలోనూ సవాల్​ విసురుతోందన్నారు. వాతావరణ మార్పులు, కోవిడ్ ఉజృంభణ, రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం పరిణామాలు ప్రపంచంలో విధ్వంసం సృష్టించాయని.. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఉక్రెయిన్ పై రష్యా దాడిని దృష్టిలో పెట్టుకుని ఆ దేశ చమురు, గ్యాస్​ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ప్రధాని మోడీ కోరారు. స్వచ్ఛమైన ఇంధనంతో పాటు పర్యావరణానికి భారత్​ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జీ 2‌‌0 సదస్సుకు నాయకత్వం వహించిన ఇండోనేషియాను మోడీ అభినందించారు.