
- హైదరాబాద్, సికింద్రాబాద్
- డివిజన్లలో 80 ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: బ్యాటరీ స్వాపింగ్ సర్వీస్‌లు అందించే ఇండోఫాస్ట్ ఎనర్జీ, భారతీయ రైల్వేశాఖతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండియన్ ఆయిల్, సన్ మొబిలిటీల జాయింట్ వెంచర్ అయిన ఈ కంపెనీ, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోని రైల్వే స్టేషన్ల వద్ద 80 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌లో 56, హైదరాబాద్‌లో 24 ఉన్నాయి.
మూడు నెలల్లో మరో 40 స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ స్టేషన్లలో టూ, త్రీ, ఫోర్ వీలర్ ఈవీల కోసం బ్యాటరీలు అందుబాటులో ఉంటాయి. ఇండోఫాస్ట్ ఎనర్జీ రానున్న మూడేళ్లలో 40 నగరాల్లో 10 వేల స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, 10 లక్షల మంది ఈవీ వినియోగదారులకు సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ సీఈఓ అనంత్ బద్జాత్య మాట్లాడుతూ, ఈ స్టేషన్లు చివరి మైలు కనెక్టివిటీ, డెలివరీ సేవలను బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ భాగస్వామ్యం స్వచ్ఛ రవాణా వ్యవస్థలో ముందడుగని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం ఆర్ గోపాలకృష్ణన్ అన్నారు. ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లతో రైడ్-షేరింగ్ డ్రైవర్లు, డెలివరీ భాగస్వాముల ఆదాయాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.