ఇండిగో ఎఫెక్ట్: విమాన ప్రయాణికులకు రైల్వేస్‌ బంపర్ ఆఫర్.. అదనంగా 116 అదనపు కోచ్‌లు

ఇండిగో ఎఫెక్ట్: విమాన ప్రయాణికులకు రైల్వేస్‌ బంపర్ ఆఫర్.. అదనంగా 116 అదనపు కోచ్‌లు

గడచిన నాలుగు రోజులుగా దేశంలో భారీగా విమాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశీయ సర్వీస్ ప్రొవైడర్ ఇండిగో తన విమాన సర్వీసుల రద్దు చేయటంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో నానా కష్టాలు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీ, వారి అసౌకర్యాన్ని తీర్చేందుకు రంగంలోకి దిగిన ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 ప్రీమియం రైళ్లలో ఏకంగా 116 అదనపు కోచ్‌లను యాడ్ చేసింది. ఈ కోచ్‌లను మొత్తం 114 ట్రిప్పుల వరకు పెంచడం ద్వారా రైల్వేస్ సామర్థ్యాన్ని భారీగా పెంచింది.

అతనపు కోచ్ సేవలు 2025 డిసెంబర్ 6వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ప్రయాణాలు రద్దై, ప్రత్యామ్నాయంగా రైళ్లను ఆశ్రయిస్తున్న వేలాది మంది ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనంగా మారుతోంది. అదనపు కోచ్‌ల పెంపులో దక్షిణ రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ రైల్వే ఏకంగా 18 రైళ్లలో సామర్థ్యాన్ని పెంచింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రత్యేకంగా చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్‌లను అదనంగా ఏర్పాటు చేశారు. 

దక్షిణ రైల్వే తర్వాత.. నార్తన్ రైల్వే ఎనిమిది రైళ్లలో 3AC, చైర్ కార్ కోచ్‌లను జోడించింది. దీంతో ఉత్తర కారిడార్లలో రద్దీ తగ్గనుంది. అలాగే పశ్చిమ రైల్వే నాలుగు అధిక-డిమాండ్ ఉన్న రైళ్లకు 3AC, 2AC కోచ్‌లను యాడ్ చేసింది. దీంతో దేశంలోని పశ్చిమ ప్రాంతాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వైపు ప్రయాణికుల రద్దీ తాకిడి తగ్గించటానికి ఇది తోడ్పడనుంది. చివరిగా తూర్పు మధ్య రైల్వేసైతం రాజేంద్ర నగర్-న్యూ ఢిల్లీ సర్వీసుకు అదనపు 2AC కోచ్‌లను యాడ్ చేసింది. డిసెంబర్ 6 నుండి 10వ తేదీ మధ్య ఐదు ట్రిప్పుల పాటు ఈ అదనపు సేవలు అందుబాటులో ఉంటాయి. బీహార్-ఢిల్లీ మార్గంలో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విమాన సేవల రద్దులతో ఏర్పడిన అసాధారణ రద్దీని యుద్ధప్రాతిపదిక చర్యలతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది భారతీయ రైల్వేలు.