
హైదరాబాద్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినందున రైల్వే సిబ్బంది, ప్రయాణికులు కచ్చితంగా కరోనా రూల్స్ పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సూచించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో రైళ్ల భద్రతపై డివిజనల్ మేనేజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో రైళ్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వం, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతూ అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా లోకో పైలట్ సిబ్బందికి పూర్తి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.