- 14.22 కోట్ల టన్నుల సరకు రవాణాతో రూ.430 కోట్ల అదనపు ఆదాయం
- ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం ట్రాన్స్‌పోర్టులో భారీ వృద్ధి
- తాజా రికార్డులను అధికారికంగా ప్రకటించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్త ప్రయాణాల్లో రైల్వే శాఖ మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో గత జూన్ నెలలో రైల్వే శాఖ సరికొత్త రికార్డును నమోదు చేసింది. గతేడాది ఇదే జూన్‌లో దేశవ్యాప్తంగా 62.37 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించగా.. ఈసారి ఆ సంఖ్య ఏకంగా 63.81 కోట్లకు చేరింది. స్వల్ప, దూర ప్రయాణాలను కవర్ చేసే నాన్-సబర్బన్ విభాగంలో ప్రయాణికుల సంఖ్య 28.90 కోట్ల నుంచి 30.04 కోట్లకు పెరిగి..3.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదేవిధంగా నగరాల పరిధిలో నడిచే సబర్బన్ విభాగంలోనూ ప్రయాణికుల సంఖ్య 33.46 కోట్ల నుంచి 33.77 కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలను కేంద్ర రైల్వే శాఖ గురువారం అధికారికంగా వెల్లడించింది.
సరకు రవాణాలోనూ సరికొత్త రికార్డు
ప్రయాణికుల రవాణాలోనే కాకుండా, సరకు రవాణాలోనూ రైల్వే శాఖ సరికొత్త రికార్డులను సృష్టించింది. గత నెలలో భారతీయ రైల్వే 142.21(14.22 కోట్ల టన్నులు) మిలియన్ టన్నుల సరకును రవాణా చేసింది. గతేడాది జూన్‌లో 136.71 మిలియన్(13.67 కోట్ల టన్నులు) టన్నుల సరకు మాత్రమే రవాణా కాగా, ఈసారి అందులో 4 శాతం వృద్ధి నమోదైంది. భారీ సరకు రవాణా కారణంగా జూన్ 2025తో పోలిస్తే ఈసారి రైల్వే శాఖకు సుమారు రూ.430 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. రైల్వే శాఖ రవాణా చేసిన సరకుల్లో ఎరువుల లోడింగ్ అత్యధికంగా 19.1% పెరిగింది. వీటితో పాటు ఇతర వస్తువులు 17.3%, ఇనుప ఖనిజం 9.4%, క్లింకర్ 7.2 శాతం, దేశీయ బొగ్గు 4.9 శాతం, మొత్తం బొగ్గు రవాణా 3.6 శాతం మేర పెరిగాయి.
