- 422 కిలోమీటర్లలో 360 టీఈయూల కంటైనర్ల రవాణా
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రైల్వే సరుకు రవాణా రంగంలో మరొక కీలక మైలురాయిని అధిగమించింది. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌పై ముంబైలోని జేఎన్‌పీటీ నుంచి వడోదర డివిజన్‌లోని వార్నామా కాంకోర్ జీసీటీకి తొలిసారిగా డబుల్ స్టాక్ లాంగ్‌హాల్ కంటైనర్ రైలు విజయవంతంగా నడిపించింది. శుక్రవారం రాత్రి బయల్దేరిన ఈ రైలు దాదాపు 422 కిలోమీటర్లు ప్రయాణించి, 360 టీఈయూల కంటైనర్లను సురక్షితంగా చేరవేసింది.
రెండు డబుల్ స్టాక్ రేక్‌లను కలిపి రూపొందించిన ఈ లాంగ్‌హాల్ రైలులో మొత్తం 3,922 టన్నుల బరువుగల సరుకును రవాణా చేశారు. ఒక్కో రేక్‌లో 45+1 కంటైనర్లు ఉన్నాయి. ఈ డబుల్ స్టాక్ లాంగ్‌హాల్ రైళ్ల వల్ల ఒకే ప్రయాణంలో ఎక్కువ కంటైనర్లను తరలించే వీలు కలగడమే కాకుండా పోర్టులు, టెర్మినళ్ల వద్ద రద్దీ తగ్గుతుంది. తక్కువ ఇంజిన్లు, వ్యాగన్లతో మార్గ సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. విద్యుత్ ఆధారితంగా సాగే ఈ రవాణా వల్ల డీజిల్ వినియోగం, కర్బన ఉద్గారాలు తగ్గి, రోడ్డు రవాణాపై భారం తగ్గుతుంది.
