- అమెరికా ఆంక్షలు సడలించడంతో కొనుగోలుకు సన్నద్ధం
న్యూఢిల్లీ: ఇరాన్ చమురుపై 30 రోజుల ఆంక్షల సడలింపును అమెరికా ప్రకటించడంతో భారత్ రిఫైనరీలు ఇరాన్ క్రూడాయిల్ కొనుగోలుకు సన్నద్ధమవుతున్నాయి. భారత్ రిఫైనరీ వర్గాలు ఇరాన్ నుంచి ఆయిల్కొంటామని చెప్తున్నాయి. అయితే, పేమెంట్ విధానం, రవాణా, బీమాపై అమెరికా నుంచి క్లారిటీ కోసం కంపెనీలు వేచి చూస్తున్నాయి.
క్రూడాయిల్ మార్కెట్ డేటా ప్రకారం సుమారు 17 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు పెర్షియన్ గల్ఫ్ నుంచి చైనా సముద్ర జలాల వరకు వివిధ ప్రాంతాల్లో షిప్‌లలో ఉందని కేప్లర్ అనే సంస్థ రిపోర్టులో పేర్కొంది. అయితే, మార్చి 20కి ముందు నౌకల్లో లోడ్ అయిన, ఏప్రిల్ 19 నాటికి అందజేయాల్సిన క్రూడాయిల్‌కు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని, కొత్తగా ఉత్పత్తి చేసే ఆయిల్ కొనుగోళ్లకు అనుమతి లేదని అమెరికా పేర్కొంది.
యుద్ధం మొదలైన తర్వాత చమురుపై ఆంక్షలను సడలించడం ఇది మూడోసారి. రష్యా ఆయిల్‌పై ఆంక్షలు సడలించినప్పుడు భారత్ పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపింది. అయినప్పటికీ ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ వద్ద ఎమర్జెన్సీ ఆయిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇరాన్ఆయిల్ కొనుగోళ్లలో అనేక చిక్కులు ఉన్నాయి. ఆ దేశం తమ ఆయిల్లో ఎక్కువ భాగం పాత ‘షాడో ఫ్లీట్’ నౌకల్లో ఉంది. ఇవి అంతర్జాతీయ షిప్పింగ్, బీమా నిబంధనలను పూర్తిగా పాటించవు. బ్యాంకింగ్ ఆంక్షలు కూడా చెల్లింపులను ఇబ్బందికరంగా మార్చుతున్నాయి.
