ఎన్నాళ్లో వేచిన స్వర్ణం... 41 ఏండ్ల తర్వాత ఇండియాకు గోల్డ్​

ఎన్నాళ్లో వేచిన స్వర్ణం... 41 ఏండ్ల తర్వాత ఇండియాకు గోల్డ్​
  • ఈక్వెస్ట్రియన్​లో 41 ఏండ్ల తర్వాత ఇండియాకు గోల్డ్​
  • సెయిలింగ్‌‌‌‌లో  నేహాకు సిల్వర్‌‌‌‌, అలీకి బ్రాంజ్‌‌‌‌ 
  • మూడో రోజు 3 మెడల్స్‌‌‌‌

హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌‌‌‌లో తొలి రెండు రోజులు  షూటర్లు, రోయర్లు, క్రికెటర్లు సత్తా చాటితే మూడో రోజు  ఈక్వెస్ట్రియన్స్‌‌‌‌ అదరగొట్టారు. పెద్దగా పరిచయం లేని ఆట ఈక్వెస్ట్రియన్‌‌‌‌ (గుర్రపు స్వారీ)లో ఇండియా  డ్రెస్సేజ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌లో తొలి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈక్వెస్ట్రియన్​లో 41 ఏండ్ల తర్వాత ఇండియాకు బంగారు పతకం అందించింది. మరోవైపు సెయిలింగ్​లో సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ లభించగా.. మూడో రోజు ఇండియా మూడు మెడల్స్‌‌‌‌తోనే సరిపెట్టుకుంది.ఇండియా ఈక్వెస్ట్రియన్స్ సుదీప్తి హజేలా, దివ్యాకృతి సింగ్‌‌‌‌, విపుల్‌‌‌‌ హృదయ్‌‌‌‌, అనూష్‌‌‌‌ అగర్వాలా అంచనాలను అందుకున్నారు. 

సెలక్షన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లోనే గత ఎడిషన్ల ఆసియా గేమ్స్‌‌‌‌ మెడల్‌‌‌‌ విన్నర్ల కంటే మంచి స్కోరు సాధించిన ఈ నలుగురూ అలవోకగా బంగారు పతకం గెలిచారు. మంగళవారం జరిగిన డ్రెస్సేజ్​ పోటీలో 209.205 పర్సెంటేజ్‌‌‌‌ పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ కైవసం చేసుకున్నారు. చైనా (204.882), హాంకాంగ్‌‌‌‌ (204.852) సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ గెలిచాయి. 1982లో ఢిల్లీ ఆసియా గేమ్స్‌‌‌‌లో  టీమ్‌‌‌‌ ఈవెంటింగ్‌‌‌‌, టెంట్‌‌‌‌ పెగ్గింగ్‌‌‌‌, ఇండివిడ్యువల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ఇండియాకు మూడు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ లభించాయి. డ్రెస్సేజ్‌‌‌‌ విభాగంలో మాత్రం ఇదే తొలి గోల్డ్. 1986లో బ్రాంజ్​ లభించింది.

పోటీ.. స్కోరు ఇలా..

ఈక్వెస్ట్రియన్‌‌‌‌లో డ్రెస్సేజ్‌‌‌‌,ఈవెంటింగ్‌‌‌‌, ఎండ్యూరన్స్‌‌‌‌, షో జంపింగ్‌‌‌‌, టెంట్‌‌‌‌ పెగ్గింగ్‌‌‌‌ తదితర ఈవెంట్లు ఉంటాయి. వీటిలో చూడ్డానికి సింపుల్‌‌‌‌గా కనిపించినా డ్రెస్సేజ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ చాలా కష్టమైనది. స్వారీ చేస్తున్న వ్యక్తి (రైడర్​)కి, గుర్రానికి మధ్య మంచి కోఆర్డినేషన్, బాండింగ్‌‌‌‌ చాలా ముఖ్యం. డ్రెస్సేజ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో  రైడర్‌‌‌‌ తన గుర్రంతో నిర్దేశిత మూవ్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఎలా పెర్ఫామ్‌‌‌‌ చేయిస్తాడనే ఆధారంగా జడ్జిలు స్కోరు ఇస్తారు. ప్రతీ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌కు 0 నుంచి 10 మార్కులు ఇస్తారు. 

తమ గుర్రాలతో  రైడర్ల పెర్ఫామెన్స్‌‌‌‌ ముగిసిన తర్వాత  ప్రతీ రైడర్‌‌‌‌కు ఓవరాల్‌‌‌‌ స్కోరు లభిస్తుంది. దాని నుంచి  పర్సెంటేజ్‌‌‌‌ లెక్కగడతారు. ఎక్కువ పర్సెంటేజ్‌‌‌‌ లభించిన రైడర్‌‌‌‌ తాను పోటీపడ్డ క్లాస్‌‌‌‌ విన్నర్‌‌‌‌గా నిలుస్తాడు. టీమ్‌‌‌‌లో టాప్‌‌‌‌3 రైడర్ల స్కోర్లను లెక్కించి విన్నర్‌‌‌‌ను నిర్ణయిస్తారు. కాగా.  టీమ్​ ఈవెంట్​లో అదరగొట్టిన నలుగురు ఇండియన్స్​ వ్యక్తిగత విభాగంలోనూ పతక వేటలో నిలిచారు..

బరిలో యువరాణి

డ్రెస్సేజ్ ఈవెంట్​లో థాయ్​లాండ్​కు చెందిన సిరివన్నవరి స్పెషల్​ ఎట్రాక్షన్​గా నిలిచింది. ఆమె థాయ్​లాండ్​ దేశ యువరాణి కావడం విశేషం. ఈ ఈవెంట్​లో థాయ్​ జట్టు ఐదో ప్లేస్​ సాధించింది.

నేహాకు సిల్వర్​.. అలీకి బ్రాంజ్​

రోయింగ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ను ఇండియా ఐదు మెడల్స్‌‌‌‌తో ముగించగా.. ఇప్పుడు సెయిలర్ల వంతొచ్చింది. 17 ఏండ్ల యంగ్‌‌‌‌ సెయిలర్‌‌‌‌ నేహా ఠాకూర్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరవగా.. ఈబద్‌‌‌‌ అలీ బ్రాంజ్‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. గర్ల్స్​ డింగి ఐఎల్‌‌‌‌సీఏ-–4 ఈవెంట్‌‌‌‌లో నేహా రెండో ప్లేస్​ సాధించింది. 11 రేసులతో కూడిన ఈవెంట్​లో నేహా మొత్తం 32 పాయింట్లు రాబట్టింది.  ఇందులో 27 పాయింట్ల నెట్​ స్కోరుతో రెండో ప్లేస్​ద్వారా సిల్వర్​ సొంతం చేసుకుంది. థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌కుచెందిన నొపాసోర్న్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ నెగ్గగా, సింగపూర్‌‌‌‌కు చెందిన  మారీ కార్లీ బ్రాంజ్‌‌‌‌ గెలిచింది. 

మరోవైపు మెన్స్‌‌‌‌ విండ్‌‌‌‌సర్ఫర్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌:ఎక్స్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ఈబద్‌‌‌‌ అలీ 52 పాయింట్ల నెట్‌‌‌‌ స్కోరుతో మూడో స్థానంతో కాంస్యం కైవసం చేసుకున్నాడు. మొత్తం 14 రేసుల్లో అతను 59 పాయింట్ల రాబట్టాడు. కానీ, సెకండ్‌‌‌‌, థర్డ్‌‌‌‌ రేసులను పూర్తి చేయకపోవడంతో ఏడు పాయింట్లు కోల్పోయాడు. అయినా మూడో ప్లేస్‌‌‌‌లో నిలిచి పతకం అందుకున్నాడు.

 క్వార్టర్స్‌‌‌‌లో నరేందర్‌‌‌‌

బాక్సింగ్​లో  నరేందర్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌ చేరుకున్నాడు.  మెన్స్‌‌‌‌ +92 కేజీ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో కిర్గిస్తాన్‌‌‌‌కు చెందిన ఎల్చోరో ఉలును తొలి రౌండ్‌‌‌‌లోనే నాకౌట్‌‌‌‌ చేశాడు.  57 కేజీ తొలి బౌట్‌‌‌‌లో సచిన్‌‌‌‌ 5–0తో అస్రి ఉద్దీన్‌‌‌‌ (ఇండోనేసియా)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌‌‌‌ చేరాడు. 

రెండో ప్లేస్‌‌‌‌లో విదిత్‌‌‌‌

మెన్స్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ చెస్‌‌‌‌లో ఇండియా టాప్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ విదిత్‌‌‌‌ సంతోష్‌‌‌‌ ఏడో రౌండ్‌‌‌‌లో చైనా టాప్‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌ వెయ్‌‌‌‌ యిని ఓడించాడు. ఏడు రౌండ్ల తర్వాత అతను 5 పాయింట్లతో జాయింట్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు. తెలంగాణ జీఎం అర్జున్‌‌‌‌ 4.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి మూడో ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు. విమెన్స్‌‌‌‌లో హంపి, హారిక చెరో 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌లో మరో రెండు రౌండ్ల పోటీలు ఉన్నాయి.

జూడోలో చేజారిన బ్రాంజ్‌‌‌‌

జూడోకా తులికా మాన్‌‌‌‌ విమెన్స్ +78 కేజీ  బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ ప్లే ఆఫ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 0–10తో మంగోలియాకు చెందిన అమరైఖన్‌‌‌‌ చేతిలో ఓడింది. ఇండియా మెన్స్‌‌‌‌ 4x100మీ మిడ్లే టీమ్‌‌‌‌ 3:40.20 సెకండ్లతో నేషనల్‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌ చేసినా ఐదో ప్లేస్‌‌‌‌తో  సరిపెట్టింది.

ఫెన్సర్ భవానీ దేవికి నిరాశ

ఇండియా స్టార్‌‌‌‌ ఫెన్సర్‌‌‌‌ భవానీ దేవి క్వార్టర్‌‌‌‌ ఫైనల్లోనే ఓడి నిరాశ పరిచింది. విమెన్స్‌‌‌‌  సాబ్రె కేటగిరీలో దేవి 7–15తో చైనాఫెన్సర్ యకి షవో చేతిలో ఓడింది. ఇక, స్క్వాష్‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్ 3–0తో పాక్​ను, మెన్స్‌‌‌‌ టీమ్​ 3–0తో సింగపూర్‌‌‌‌ను ఓడించింది.