- 29 పైసలు తగ్గి 90.78 స్థాయికి పతనం
న్యూఢిల్లీ: రూపాయి పతనం ఆగడం లేదు. దిగుమతిదారుల నుంచి డాలర్‌కి డిమాండ్ పెరగడంతో మన కరెన్సీ విలువ పడిపోతోంది. డాలర్‌తో రూపాయి సోమవారం సెషన్‌లో 29 పైసలు తగ్గి జీవితకాల కనిష్టమైన 90.80 కి చేరింది. చివరికి 90.78 వద్ద సెటిలయ్యింది. ఇండియా–అమెరికా ట్రేడ్ డీల్‌లో అనిశ్చితి, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు వెళ్లిపోతుండడం కూడా రూపాయి పతనానికి కారణాలు. “ఇండియా రూపాయి రికార్డ్ కనిష్టాలకు పడింది. ఈ ఏడాది ఎక్కువగా విలువ కోల్పోయిన ఆసియా కరెన్సీల్లో ముందుంది. నవంబర్‌లో వాణిజ్య లోటు తగ్గినా, రూపాయి పతనం ఆగడం లేదు”అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. కాగా, దిగుమతిదారులు విదేశాల్లో కొనుగోలు జరపాలంటే తమ దగ్గరున్న రూపాయిలను డాలర్లలోకి మార్చాలి. దీనర్ధం డాలర్లను కొనుగోలు చేయాలి. దీంతో ఈ కరెన్సీకి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు తమ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకునేటప్పుడు తమ రూపాయిలను డాలర్లలోకి మారుస్తారు. డాలర్ పెరగడానికి ఇది కూడా కారణం.
అమెరికాతో డీల్..
యూఎస్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో పురోగతి సాధించామని, త్వరలో ఫ్రేమ్‌వర్క్ రెడీ అవుతుందని కామర్స్ సెక్రెటరీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. కానీ, ఎప్పటిలోపు పూర్తవుతుందో చెప్పలేనని అన్నారు.
