అల్మాటీ: కజకిస్తాన్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీలో భారత స్కీట్ షూటర్లు నిరాశపరిచారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఏ ఒక్కరు కూడా ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. ఒలింపియన్ మైరాజ్ అహ్మద్ ఖాన్ 119 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచి భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. భవతేజ్ సింగ్ గిల్ 119 పాయింట్లతో 19వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
అనంత్‌జీత్ సింగ్ నరుకా 117 పాయింట్లతో 38వ స్థానంలో, గుర్జోత్ సింగ్ ఖంగురా 115 పాయింట్లతో 54వ స్థానంలో నిలిచారు. అభయ్ సింగ్ సెఖోన్ 113 పాయింట్లతో 71వ స్థానానికి పరిమితమయ్యారు. మహిళల విభాగంలో రైజా ధిల్లాన్ 115 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచి భారత్ తరపున మెరుగైన ప్రదర్శన చేశారు. పరినాజ్ ధలివాల్ 32వ స్థానంలో, గనేమత్ సెఖోన్ 33వ స్థానంలో నిలిచారు. వంశిక తివారి 29వ స్థానంలో, రశ్మి రాథోడ్ 47వ స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
