అల్మట్టి (కజకిస్తాన్): షాట్‌గన్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన స్కీట్ ఈవెంట్‌లో సీనియర్ షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్ నిరాశపరచగా, గనేమత్ సెఖోన్ మాత్రం ఫైనల్ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో చండీగఢ్‌కు చెందిన గనేమత్ సెఖోన్ 75 పాయింట్లకు 70 సాధించి ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. టాప్-8లో నిలిచిన వారు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
కేవలం ఒక్క పాయింట్ దూరంలో ఉన్న గనేమత్.. మంగళవారం జరిగే మిగిలిన 50 రౌండ్లలో రాణిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. పురుషుల విభాగంలో 50 ఏళ్ల వెటరన్ షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్ తొలి రౌండ్‌లో 25 పాయింట్లు సాధించినా, తర్వాతి రౌండ్లలో 23 చొప్పున మార్కులు పొంది 27వ స్థానానికి పడిపోయాడు.
మరో ఒలింపియన్ అనంత్‌జీత్ సింగ్ నరుకా కూడా శుభారంభం చేసినా ఆ తర్వాత తడబడి 69 పాయింట్లతో వెనుకబడ్డాడు. గుర్జోత్ సింగ్ ఖంగురా 70 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో రైజా థిల్లాన్ 69 పాయింట్లు, పరినాజ్ ధాలివాల్ 66 పాయింట్లు సాధించారు. ఆసియా క్రీడలు జరగనున్న ఈ ఏడాదిలో భారత షూటర్లు పతకాలు సాధించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల టాంగియర్‌లో జరిగిన ప్రపంచకప్‌లోనూ భారత జట్టుకు ఒక్క పతకం కూడా దక్కలేదు.
