న్యూఢిల్లీ: టాప్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌తో కూడిన ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ ఆదివారం థాయ్‌లాండ్‌కు బయలుదేరింది. థాయ్‌లాండ్ వేదికగా జరగబోయే యొనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ (జనవరి 12– 17), టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ (19–24)లో ఇండియా టీమ్ పోటీపడనుంది. సైనా, ప్రణీత్, శ్రీకాంత్‌తోపాటు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, ధృవ్ కపిల, మను అత్రి, డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్వినీ పొన్నప్ప, సిక్కిరెడ్డి జట్టులో ఉన్నారు.ప్లేయర్ల వెంట కోచ్‌లు ఇతర సపోర్ట్ స్టాఫ్ కూడా వెళ్లారు. హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కిన వీరు దుబాయ్ మీదుగా థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఇక, ప్రస్తుతం యూకేలో ఉన్న వరల్డ్ చాంపియన్ పీవీ సింధు కూడా ఈ టోర్నీల్లో బరిలోకి దిగనుంది. ఆమె లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరుకోనుంది. గాయం కారణంగా లక్ష్యసేన్ ఈ టోర్నీల్లో ఆడటం లేదు. అయితే, శ్రీకాంత్ మినహా ఇతర ప్లేయర్లంతా థాయ్‌లాండ్‌లో జరిగే టోర్నీతోనే కాంపిటేటివ్ బ్యాడ్మింటన్ రీస్టార్ట్ చేయనున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో ఇండియా నుంచి శ్రీకాంత్ బరిలోకి దిగాడు.
మొమొటోకు పాజిటివ్.. జపాన్ విత్ డ్రా
థాయ్‌లాండ్ వేదికగా జరగబోయే టోర్నీల నుంచి జపాన్ విత్ డ్రా చేసుకుంది. తమ స్టార్ ప్లేయర్, వరల్డ్ నంబర్‌వన్ కెంటా మొమొటో.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గత జనవరిలో రోడ్డు యాక్సిడెంట్‌కు గురైన మొమొటో థాయ్‌లాండ్‌లో జరిగే టోర్నీలతో ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లోకి తిరిగి రావాలని అనుకున్నాడు. కానీ , బ్యాంకాక్ బయలుదేరేముందు చేసిన టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో అది నెరవేరకుండా పోయింది.

