సౌర గాలులపై ఆదిత్య స్టడీ షురూ

సౌర గాలులపై ఆదిత్య స్టడీ షురూ
  •     బాగానే పనిచేస్తున్న ఇస్రో శాటిలైట్ 
  •     సోలార్ విండ్స్​లోని ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్ స్థాయిల లెక్కింపు 

బెంగళూరు :  సూర్యుడిపై అధ్యయనం కోసం పంపిన ఆదిత్య–ఎల్1 శాటిలైట్ పూర్తి నార్మల్ గానే పని చేస్తోందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శనివారం వెల్లడించింది. భూమి వైపు వస్తున్న సౌర గాలులను రెండ్రోజులు  స్టడీ చేసిన శాటిలైట్.. సోలార్ విండ్స్ లోని ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్ స్థాయిలను లెక్కించిందని తెలిపింది. ఈ మేరకు ఆదిత్య శాటిలైట్ లోని యాస్పెక్స్ (ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్) పరికరం పంపిన డేటాతో రూపొందించిన ఎనర్జీ  హిస్టోగ్రామ్ గ్రాఫ్ ఫొటోను ఇస్రో రిలీజ్ చేసింది.

యాస్పెక్స్ లో స్విస్ (సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్), స్టెప్స్ (సుప్రా థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్) అనే రెండు పరికరాలు ఉన్నాయి. వీటిలో స్టెప్స్ పరికరం సెప్టెంబర్ 10న, స్విస్ పరికరం నవంబర్ 2న యాక్టివేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ రెండూ బాగానే పని చేస్తున్నాయని ఇస్రో తెలిపింది. స్విస్ పరికరంలో 360 డిగ్రీల కోణంలో పరిశీలించే రెండు సెన్సర్లు ఉన్నాయని.. తాజాగా వీటి సాయంతో సోలార్ విండ్స్ లోని అయాన్లను ప్రధానంగా ప్రోటాన్లు, ఆల్ఫా పార్టికల్స్ ను స్విస్ పరికరం విజయవంతంగా లెక్కించిందని ఇస్రో పేర్కొంది.

సౌర గాలులలోని అయాన్లపై అధ్యయనం ద్వారా వీటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడంతో పాటు భూ వాతావరణంపై ఎఫెక్ట్ ను అంచనా వేసేందుకు వీలు కానుందని వివరించింది. కాగా, సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఆదిత్య శాటిలైట్ ప్రస్తుతం భూమికి 15 లక్షల కి.మీ. దూరంలోని లాగ్రాంజియన్ పాయింట్–1(ఎల్1)కు చేరువలో ఉంది. ఇస్రో తొలి స్పేస్ అబ్జర్వేటరీ అయిన ఆదిత్య శాటిలైట్.. ఎల్1 పాయింట్ నుంచి నిరంతరాయంగా సూర్యుడిలో జరిగే మార్పులను స్టడీ చేయనుంది.