మరోసారి వాస్తవాధీన రేఖ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. పర్వత ప్రాంతాల్లో పనిచేయడం కోసం కఠోర శిక్షణ పొందిన బలగాలను సరిహద్దులకు తరలించింది. ఈ బలగాలకు ఎత్తయిన ప్రాంతాల్లో చైనా అతిక్రమణలను సమర్థంగా తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. ఈ బలగాలు సరైన మార్గం లేని, వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు కాలినడన వెళ్లి యుద్ధం చేయగలవు. పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ప్రత్యేక బలగాలు కీలకపాత్ర పోషించాయి. కీలక ప్రాంతాల్లో రెండు దేశాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ నెల 15 తర్వాత గాల్వన్ లోయలో పరిస్థితి మామూలుగానే ఉందని, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాలూ రెండు వైపులా బలగాలను మోహరిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు అక్కడ నిర్మాణంలో ఉన్న 32 రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

