Hindenburg: భారత మార్కెట్ వణికిస్తున్న హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్‌

Hindenburg: భారత మార్కెట్ వణికిస్తున్న హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్‌

భారత్ స్టాక్ మార్కెట్లు హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్టుతో కుదేలవుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.10 లక్షల కోట్లను పోగొట్టుకున్నాయి. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న అదానీ 7వ స్థానానికి పడిపోయారు. దేశంలో కార్పొరేట్‌ దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్‌ విలువ ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.

అసలు  హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఏంటి..? 

న్యూయార్క్‌ కేంద్రంగా హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చి సంస్థ పని చేస్తోంది. 2017లో నాథన్‌ అండర్సన్‌ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని ‘హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్’ తన వెబ్‌సైట్‌లో స్వయంగా వెల్లడించింది. పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రీసెర్చి సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను కూడా పసిగడుతుంది. ఈ కంపెనీ షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది. 

స్టాక్ మార్కెట్‌లోని ప్రతి లావాదేవీలో ‘ముందు కొనడం- తర్వాత అమ్మడం’ లేదా ‘ముందు అమ్మడం - తర్వాత కొనడం’ జరుగుతుంటాయి. షేర్లను కొని.. దాని విలువ పెరిగాక విక్రయించి లాభాలు పొందవచ్చు. రెండో విధానంలో షేర్లను తక్కువ ధర వద్ద కొని.. అధిక ధర వద్ద విక్రయించి లాభాలు ఆర్జించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండో పద్ధతినే ‘షార్ట్‌ సెల్లింగ్‌’ అని అంటారు.

నాథన్‌ అండర్సన్‌ ఎవరు..? 

నాథన్‌ అండర్సన్‌ గురించి పెద్దగా వివరాలు బయటకు తెలియవు. అమెరికాలోని కనెక్టికట్‌ యూనివర్శిటీలో అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ పట్టా అందుకొన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో స్వచ్ఛందంగా అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేశాడు. పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఎలా పనిచేయాలో అక్కడే నేర్చుకొన్నట్లు అండర్సన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాథన్‌ అండర్సన్‌ అమెరికా వచ్చిన తర్వాత ఫ్యాక్ట్‌ సెట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్‌లో ఓ బ్రోకర్‌ డీలర్‌ వద్ద పని చేసినట్లు 2021లో ఫైనాన్షియల్‌ టైమ్స్ పేర్కొంది. హిండెన్‌ ప్రారంభించడానికి ముందు హారీ మార్కోపోలోస్‌తో కలిసి ప్లాటినం పార్ట్‌నర్స్‌ అనే సంస్థపై దర్యాప్తు కోసం పని చేశాడు. హారీ గతంలో బెర్నీ మాడాఫ్‌ అనే మోసపూరిత పథకం గుట్టు విప్పేందుకు పని చేశాడు.

కంపెనీలపై నిఘా 

హిండెన్‌బర్గ్‌ ఏదైనా కంపెనీపై నిఘా పెడితే ముందుగా ఆరు నెలలకు పైగా పబ్లిక్‌ రికార్డులు, అంతర్గత కార్పొరేట్‌ పత్రాలను పరిశీలించి, కంపెనీ ఉద్యోగులతోనూ మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసే భాగస్వాములకు ఆ రిపోర్టులను అందిస్తుంది. ఆ తర్వాత బృంద సభ్యులందరూ సదరు కంపెనీ షేర్లలో షార్ట్‌ పొజిషన్లు తీసుకొంటాయి. ఆ కంపెనీ విలువ పతనమైన సమయంలో హిండెన్‌బర్గ్‌కు ఆదాయం లభిస్తుంది. 2020లో అమెరికాలోని నికోలా కార్పొరేషన్‌ను ఇలానే లక్ష్యంగా చేసుకొంది. ఆ కంపెనీలో అవకతవకలు బయటపడటంతో కంపెనీ స్టాక్‌ విలువ 40 శాతం దిగజారింది. ఆ తర్వాత అమెరికా ఎస్‌ఈసీ దర్యాప్తులో కంపెనీలో మోసం జరిగినట్లు గుర్తించారు. 2017 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 కంపెనీలను హిండెన్‌బర్గ్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

హిండెన్‌బర్గ్‌ పేరు వెనుక చరిత్ర

హిండెన్‌బర్గ్‌ అనేది జర్మనీకి చెందిన ప్యాసింజర్‌ ఎయిర్‌ షిప్‌ పేరు.  1937లో న్యూజెర్సీలోని మాంచెస్టర్‌ టౌన్‌షిప్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం 35 మంది మరణించారు. 62 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హిండెన్‌బర్గ్‌ పేరును తమ సంస్థకు పెట్టడానికి కారణాన్ని కూడా వెబ్‌సైట్ లో వెల్లడించారు. ‘‘హిండెన్‌బర్గ్‌ పూర్తిగా మానవుడు సృష్టించిన విపత్తు. విశ్వంలోనే అత్యధికంగా మండే స్వభావం ఉన్న హైడ్రోజన్‌ నింపిన బెలూన్‌లో 100 మందిని ఎక్కించారు. గతంలో ఇలాంటి ఎయిర్‌షిప్‌లకు ప్రమాదాలు జరిగినా.. అప్పట్లో నిర్వాహకులు భిన్నంగా ప్రయత్నించామని చెప్పారు. అయినా.. ప్రమాదం జరిగింది. మేము కూడా  మానవులు సృష్టించిన ప్రమాదాలు మార్కెట్లలో తిరుగుతుంటే వాటిని అన్వేషిస్తాం. అవి బాధితులను ఆకర్షించడానికి ముందే వాటిని వెలుగులోకి తెస్తాం’’ అని పేర్కొంది. 

అదానీ గ్రూపుపై భారీ ఎఫెక్ట్ 

కేంద్ర  బ‌డ్జెట్‌కు ముందు, దేశీయ స్టాక్‌ మార్కెట్లకు అదానీ  షేర్ల పతనం సెగ కొనసాగుతోంది. ఈనెల 27న అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం భారీగా కొనసాగడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. అలాగే బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో సెన్సెక్స్‌ 1200 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 17500 స్థాయిని  కోల్పోయింది. ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో అదానీ గ్రూపునకు చెందిన 7 కంపెనీల షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. రెండురోజులుగా కొనసాగుతున్న అమ్మకాల వెల్లువలో అదానీ మార్కెట్‌ క్యాప్‌ లక్షల కోట్లు  తుడుచు పెట్టుకుపోయింది.