భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం చూపించిన అదే జోరును గురువారం కూడా కొనసాగిస్తున్నాయి. దీంతో మార్కెట్లు స్టార్ట్ అవ్వగానే బెంచ్ మార్క్ సూచీలు దూసుకుపోవటంతో దలాల్ స్ట్రీట్ బుల్స్ జోరుతో కొనసాగుతోంది. ఉదయం 10.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 343 పాయింట్ల లాభంతో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 78 పాయింట్లు గెయిన్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా మంచి లాభాలతో కొనసాగుతున్నాయి.
దాదాపు 14 నెలల తర్వాత నిఫ్టీ సూచీ ఆల్ టైం గరిష్టాన్ని చేరుకోగా.. సెన్సెక్స్ 86వేల మార్కును అధిగమించి ఫుల్ జోష్ తో ముందుకు సాగుతోంది. దీంతో సరికొత్త రికార్డుల మోత మార్కెట్లలో కొనసాగుతోంది. ప్రధానంగా ఐటీ స్టాక్స్ లాభాలతో ముందుకు సాగుతుండగా.. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మాత్రం మార్కెట్లను కిందికి లాగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా 2025లో రూ.7 లక్షల కోట్లకు కొనుగోళ్లు చేపట్టి రికార్డు సృష్టించారు.
మార్కెట్లను మెరుపు వేగంతో నడిపిస్తున్న అంశాలు ఇవే..
1. ముందుగా మార్కెట్ల సెంటిమెంట్లను ప్రభావితం చేస్తోంది విదేశీ మదుపరుల ప్రవర్తనే. బుధవారం కూడా వరుసగా నికర కొనుగోలుదారులు ఉన్న ఎఫ్ఐఐలు రూ.4వేల 800 కోట్లు షాపింగ్ చేయటం నమ్మకాన్ని పెంచింది. దీనికి తోడు రానున్న త్రైమాసికాల్లో దేశీయ కార్పొరేట్ కంపెనీలు బలమైన ఆదాయాలను నమోదు చేస్తాయని అంచనాలు కూడా మార్కెట్లను బుల్ జోరులో నడిపిస్తున్నట్లు జియోజిత్ సంస్థ ప్రతినిధి వికె విజయకుమార్ వెల్లడించారు.
2. ఇక మార్కెట్ల దూకుడుకు మరో కారణం అమెరికా నుంచి డిసెంబర్ ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నమ్మకం పెరగటమే. ఫెడ్ రేట్లు తగ్గిస్తే దానికి అనుగుణంగా భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించవచ్చని పెట్టుబడిదారులు ఆశావహంగా ఉన్నారు. దీంతో ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ల ట్రిగర్ నిఫ్టీ, సెన్సెక్స్ ర్యాలీకి కారణంగా మారిపోయింది.
3. ఆసియా మార్కెట్లు కూడా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలతో లాభాల్లో కొనసాగటం దేశీయ పెట్టుబడిదారుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. దీనికి తోడు బుధవారం రోజున యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగియటం గ్లోబల్ మార్కెట్లకు బలమైన సంకేతాలను అందించింది. దీంతో కోప్సీ, నిఖ్కీ, షాంగై, హ్యాంగ్ సెంగ్ సూచీలు కూడా లాభాల జోరు కొనసాగిస్తున్నాయి.
ALSO READ : తగ్గిన బంగారం ధరలు.. కేజీకి రూ.4వేలు పెరిగి షాకిచ్చిన వెండి..
4. సాధారణంగా క్రూడ్ ఆయిల్ రేట్ల పతనం భారత మార్కెట్లకు సానుకూలమైన అంశంగానే పరిగణించబడుతోంది. ఈ క్రమంలో తాజాగా బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు స్వల్పంగా తగ్గి 62.83 డాలర్లకు చేరుకోవటంతో ఇది దిగుమతుల భారం, దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించటానికి దోహదపడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తు్న్నారు.
5. ఇక చివరిగా భారతీయ మార్కెట్ల ర్యాలీకి ఐఎంఎఫ్ తన తాజా రిపోర్టుల్లో 2029 ఆర్థిక సంవత్సరం నాటికి భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి దేశీయ పెట్టుబడిదారుల వరకు అందరినీ ముందుకు నడిపించటంలో మార్గనిర్థేశం చేస్తోంది. రూపాయి పతనంతో పాటు నెమ్మదిగా కొనసాగుతున్న జీడీపీ వృద్ధితో టార్గెట్ దీర్ఘకాలానికి పొడిగించబడిందని తెలుస్తోంది.
