
- వచ్చే సీజన్‌ను నిలిపివేస్తున్నట్టు ఆర్గనైజర్స్ ప్రకటన
- మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ పునరుద్ధరణపై అనిశ్చితే కారణం
- లీగ్‌ను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఐఎఫ్‌ఎఫ్ ప్రకటన
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎమ్‌ఆర్‌ఏ) పునరుద్ధరణపై అనిశ్చితి కారణంగా 2025–-26 సీజన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐఎస్‌ఎల్ ఆర్గనైజర్ అయిన ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌డీఎల్) తెలిపింది. లీగ్ నిర్వహణ విషయంలో ఎఫ్‌ఎస్‌డీఎల్, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) మధ్య ఉన్న ఎంఆర్‌ఏ ఈ ఏడాది డిసెంబర్ 8న ముగుస్తుంది. ఆ సమయానికి ఐఎస్‌ఎల్ మూడో నెలలోకి ప్రవేశిస్తుంది. డిసెంబర్ తర్వాత స్పష్టమైన ఒప్పందం లేకపోవడం వల్ల 2025-–26 ఐఎస్‌ఎల్ సీజన్‌ను నిర్వహించలేమని ఎఫ్‌ఎస్‌డీఎల్ పేర్కొంది. అందుకే సెప్టెంబర్‌లో మొదలయ్యే లీగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ఏఐఎఫ్‌ఎఫ్ స్పందించింది. చట్టానికి, నిబంధనలకు కట్టుబడి ఉంటూనే లీగ్‌ను కొనసాగించేందుకు సాధ్యమైన ప్రతిదీ చేస్తామని హామీ ఇచ్చింది.
‘ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఐఎస్‌ఎల్ ప్రాముఖ్యత గురించి పూర్తిగా తెలుసు. ఇది కేవలం దేశంలోని ఫుట్‌బాల్ నిర్మాణానికే కాకుండా, అన్ని క్లబ్‌లు, ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, అధికారులు, ఫ్యాన్స్‌కు కూడా చాలా ముఖ్యం. లీగ్‌కు అంతరాయం కలగడం వల్ల ఎదురయ్యే సవాళ్లను, ఇబ్బందులను మేం గుర్తిస్తున్నాం. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నాం’ అని శనివారం ప్రకటించింది.
ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ముసాయిదా రాజ్యాంగం కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఎఫ్‌ఎస్‌డీఎల్‌తో ఎంఆర్‌ఏ కొత్త నిబంధనలను చర్చించవద్దని ఏఐఎఫ్‌ఎఫ్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఎఫ్‌ఎస్‌డీఎల్ తో తమ చర్చలు సకాలంలోనే ప్రారంభమయ్యాయని, ఇరు పక్షాలు ప్రతిపాదనలు కూడా మార్పిడి చేసుకున్నాయని తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ చర్చలను ప్రస్తుతం నిలిపివేసినట్టు పేర్కొంది. కాబట్టి లీగ్ వాటాదారులందరూ ఓపిగ్గా ఉండాలని ఏఐఎఫ్‌ఎఫ్ కోరింది.