ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత టెన్నిస్ స్టార్ నాగల్

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత టెన్నిస్ స్టార్ నాగల్

భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు నాగల్ తెలిపాడు.

"నేను 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అధికారికంగా అర్హత సాధించానని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. నా హృదయంలో ఒలింపిక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది నాకు స్మారక క్షణం! 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇప్పటివరకూ నా కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలు. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సహాయాన్ని అందించిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌(TOPS), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)కి కృతజ్ఞతలు.." అని 26 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.

2020 టోక్యో ఒలింపిక్స్‌ ద్వారా నాగల్.. లియాండర్ పేస్ తర్వాత విశ్వక్రీడల్లో సింగిల్స్ మ్యాచ్‌  గెలిచిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌ మొదటి రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన డెనిస్ ఈస్టోమిన్‌ను ఓడించిన భారత స్టార్.. రెండో రౌండ్‌లో డానియల్ మెద్వెదేవ్‌ చేతిలో ఓడిపోయాడు. 

26 ఏళ్ల నాగల్ 2024 సీజన్ ప్రారంభం నుండి మంచి ఆట తీరు కనబరుస్తున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెయిన్ డ్రా, ఇండియన్ వెల్స్ మాస్టర్స్, మాంటె-కార్లో మాస్టర్స్, ATP 1000 ఈవెంట్‌ల మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. కాగా, ప్యారిస్ గేమ్స్‌లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, ఎన్ శ్రీరామ్ బాలాజీలు పోటీపడనున్నారు.