ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా

ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా

హైదరాబాద్: సూర్యకుమార్ యాదవ్  మెరుపు హిట్టింగ్, కోహ్లీ బాధ్యతాయుత బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ దుమ్ము రేపింది. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 186 పరుగులు చేయగా.. 187 రన్స్ టార్గెట్ తో భారత్ బరిలోకి దిగింది. ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మ్యాచ్ ను చక్కదిద్దాడు. అయితే 14 బంతుల్లో 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ సామ్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో భారత్ అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. 

దంచికొట్టిన సూర్యకుమార్ యాదవ్, కోహ్లీ...

రోహిత్ శర్మ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీతో సూర్యకుమార్ యాదవ్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదును చూసి సిక్స్ లు, ఫోర్లు కొడుతూ భారత్ స్కోర్ ను పరుగులు పెట్టించాడు. ఇక కోహ్లీ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ సూర్యకుమార్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇలా వీళ్లిద్దరూ కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ 29 బంతుల్లో, కోహ్లీ 3 బంతుల్లో తమ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ ఫించ్ కు దొరికిపోయాడు. హేజెల్ వుడ్ బౌలింగ్ లో క్యాచ్ అవుటై వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్దిక్ పాండ్యా కోహ్లీకి మంచి తోడ్పాటు అందించాడు. విరాట్ కోహ్లీ 63 పరుగుల చేసి అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ తో కలిసి పాండ్యా టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికొస్తే.. డానియేల్ సామ్స్ 2 వికెట్లు తీసుకోగా హేజెల్వుడ్, కమిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు. 

187 పరుగుల భారీ లక్ష్యాన్నిచ్చిన ఆస్ట్రేలియా...

అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ దుమ్మురేపారు. టీమిండియా బౌలర్లను చితక్కొట్టారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఓపెనర్లు ఫించ్, కామెరూన్ గ్రీన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 44 పరుగుల పాట్నర్ షిప్ను నమోదు చేశారు. ముఖ్యంగా ఓపెనర్ గ్రీన్ రెచ్చిపోయాడు. సిక్సులు, ఫోర్లతో బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరపున తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే  మరో ఓపెనర్ ఫించ్ విఫలమయ్యాడు. కేవలం 7 పరుగులు చేసిన ఫించ్.. 44 పరుగుల దగ్గర ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ను చాహల్ బుట్టలో వేసుకున్నాడు. అనంతరం వచ్చిన మాక్స్వెల్ కూడా త్వరగా పెవీలియన్ చేరడంతో..ఆసీస్ 84 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆదుకున్న డేవిడ్..

పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్ను టీమ్ డేవిడ్ ఆదుకున్నాడు. సిక్సులు, ఫోర్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..ఏ మాత్రం తగ్గకుండా..బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనికి జోష్ ఇంగిల్స్ 24 పరుగులతో, డానియల్ సామ్స్ 28 పరుగులతో సహకరించారు. చివరకు ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది.  భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసుకున్నాడు. భువీ, చాహల్,  హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

టీమిండియా తుది జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహల్, బుమ్రా

ఆసీస్ తుది జట్టు: ఫించ్, కెమరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్, టిమ్ డేవిడ్, వేడ్, జోష్ ఇంగిల్స్, పాట్ కమ్మిన్స్, డానియల్ సామ్స్, అడం జంపా, హేజిల్ వుడ్