
సిల్హెట్: విమెన్స్ ఆసియా కప్‌లో ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఎనిమిది టోర్నీల్లో ఫైనల్ చేరిన ఇండియా.. ఏడోసారి టైటిల్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. లీగ్, నాకౌట్ జైత్రయాత్రను కొనసాగిస్తూ.. ఫైనల్లోనూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి మరో కప్పు నెగ్గింది. శనివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో స్మృతి మంధాన (25 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 నాటౌట్) దంచి కొట్టడంతో.. టీమిండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 65/9 స్కోరుకే పరిమితమైంది. ఇనోకా రణవీర (18 నాటౌట్) టాప్ స్కోరర్. ఇండియా పేసర్ రేణుకా సింగ్ (3/5), రాజేశ్వరి గైక్వాడ్ (2/16), స్నేహ్ రాణా (2/13) ముప్పేట బౌలింగ్ దాడికి లంకేయులు కుదేలయ్యారు. దీంతో కెప్టెన్ ఆటపట్టు (6), హర్షిత (1), అనుష్క (2), కవిషా దిల్హారి (1), నీలాక్షి (6) సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. రణసింఘే (13) కాసేపు ప్రతిఘటించింది. తర్వాత మంధాన మెరుపు బ్యాటింగ్‌తో ఛేజింగ్‌లో ఇండియా 8.3 ఓవర్లలో 71/2 స్కోరు చేసి గెలిచింది. ఆరంభంలోనే నాలుగు బాల్స్ తేడాలో షెఫాలీ (5), జెమీమా రొడ్రిగ్స్ (2) ఔటవడంతో ఇండియా ఇన్నింగ్స్ 35/2 స్కోరుతో కొద్దిగా తడబడింది. అయితే రణసింఘే, రణవీర బౌలింగ్‌లో మూడు చూడముచ్చటైన సిక్సర్లు బాదిన మంధాన 25 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (11 నాటౌట్) అండగా నిలిచింది. ఈ ఇద్దరు థర్డ్ వికెట్‌కు 36 (24 బాల్స్) రన్స్ జోడించి విజయ లాంఛనం ముగించారు. రేణుకా సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 65/9 (ఇనోకా రణవీర (18 నాటౌట్, రేణుక 3/5), ఇండియా: 8.3 ఓవర్లలో 71/2 (స్మృతి 51 నాటౌట్, రణవీర 1/17, కవీషా దిల్హారి 1/17).
- 1 విమెన్స్ క్రికెట్‌లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ (137) రికార్డు సృష్టించింది. గతంలో సుజీ బేట్స్ (136) పేరు మీద ఈ రికార్డు ఉండేది.