ఉమెన్స్ ఆసియాకప్లో టీమిండియా జైత్రయాత్ర

ఉమెన్స్ ఆసియాకప్లో టీమిండియా జైత్రయాత్ర

ఉమెన్స్ ఆసియాకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో లంకను చిత్తు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన..రెండో మ్యాచ్లోనూ దుమ్మురేపింది. మలేషియాపై డక్ వర్త్ లూయిస్ ప్రకారం 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన మేఘనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత మహిళల జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా తర్వాతి మ్యాచ్ యూఏఈతో ఆడనుంది.

మేఘన హాఫ్ సెంచరీ..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు..20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. సబ్బినేని మేఘన 53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 69 పరుగులు చేసింది. మేఘన టీ20 కెరీర్‌లో ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. షెఫాలీ వర్మ 39 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 46 రన్స్ సాధించింది.  చివర్లో రిచా ఘోష్ 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్  ధాటిగా ఆడటంతో భారత మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది. మలేషియా బౌలర్లలో వినిఫ్రెడ్, దనియా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. 

వర్షం వల్ల రద్దు..
182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మలేషియా వర్షం అంతరాయం కలిగించే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఫస్ట్  ఓవర్లోనే మలేషియా కెప్టెన్ వినిఫ్రెడ్ దురైసింగంని దీప్తి శర్మ డకౌట్ చేయగా.. ఒకే పరుగు చేసిన విన్ జులియాను .. రాజేశ్వరి గైక్వాడ్ పెవీలియన్ చేర్చింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత మస్ ఎలీసా, ఎల్సా హంటర్  క్రీజులోకి వచ్చారు. అయితే వర్షం వచ్చే సమయానికి ఎలీసా17 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు, ఎల్సా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో..అంపైర్లు మ్యాచ్‌ని రద్దు చేశారు. ఆ తర్వాత డీఎల్‌ఎస్ విధానం ప్రకారం 5.2 ఓవర్లు ముగిసే సమయానికి మలేషియా చేయాల్సిన పరుగుల కంటే 31 పరుగులు వెనకబడి ఉండడంతో భారత జట్టను విజేతగా తేల్చారు.