పతకాలను గంగలో కలపకుండానే ఢిల్లీకి చేరుకున్న రెజ్లర్లు

పతకాలను గంగలో కలపకుండానే ఢిల్లీకి చేరుకున్న రెజ్లర్లు

తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామంటూ హరిద్వార్ కు చేరుకున్న భారత రెజ్లర్ల నిర్ణయాన్ని రైతు సంఘం నేత నరేష్ తికాయత్ వద్దని, వారించి అడ్డుకున్నారు. రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తూ.. 5 రోజులు ఆగాలంటూ కోరారు. గంగా నదిలో వేసేందుకు రెజ్లర్లు తమ వెంట హరిద్వార్ కు తీసుకెళ్లిన పతకాలను నరేష్ తికాయత్ తీసుకున్నారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్ పై 5 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన.

నరేష్ తికాయత్ సూచనతో హరిద్వార్ గంగ నదిలో తమ పతకాలను నిమజ్జనం చేయకుండానే రెజ్లర్లు మళ్లీ ఢిల్లీకి బయలుదేరారు. 5 రోజుల్లోపు బ్రిజ్‌ భూషణ్‌ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఢిల్లీకి బయలుదేరిన రెజ్లర్లు. జూన్ 11వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 4, 5 రోజుల్లో మరోసారు భేటీకావాలని నిర్ణయించారు. మొత్తంగా రెజ్లర్ల పోరాటానికి రైతు సంఘం మద్దతు తెలిపింది.

అంతకుముందు.. తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామంటూ రెజ్లర్లు హరిద్వార్ కు చేరుకున్నారు. పతకాలను గంగలో కలిపిన తర్వాత తాము ఢిల్లీ ఇండియా గేట్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. మంగళవారం (మే 30న) సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్‌కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు.

తాము హరిద్వార్‌ వెళ్లి.. హరిద్వార్‌లోని గంగా నదిలో పతకాలను విసిరేస్తామని రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ ‍ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘మేము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి.. ఇండియా గేట్‌ వద్ద నిరాహార దీక్ష చేస్తాం’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవం వేళ తమను వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌​ సింగ్‌ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్‌ మనిపించడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

లైంగిక ఆరోపణల నేపథ్యంలో... భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కి వ్యతిరేకంగా వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, బజరంగ పునియా వంటి రెజ్లర్లు ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. అయితే రెజ్లర్లు మాత్రం ఆయన్ను అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతుల మద్దతు కూడా రెజ్లర్లకు వస్తోంది.

పార్లమెంట్‌ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏ‍ర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు.. దీక్ష కోసం ఇకపై జంతర్‌ మంతర్‌ వద్దకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. 

రెజ్లర్లు ఢిల్లీలోని మరో అనువైన ప్రదేశాన్ని దీక్ష కోసం ఎంచుకోవాలని సూచించారు. ‘గత 38 రోజులుగా జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేసిన రెజ్లర్లకు మేం అన్ని సౌకర్యాలను కల్పించాం. కానీ.. ఆదివారం (మే 28న)  వారు చట్టాన్ని అతిక్రమించారు. మేం చెప్పినా వినిపించుకోలేదు. అందుకే.. అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. రెజ్లర్లు దీక్షను కొనసాగించాలనుకుంటే అనుమతి కోరుతూ దరఖాస్తు చేయొచ్చు. అయితే.. జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు అనుమతినివ్వబోం. మరోచోట వారికి అనుమతి ఇస్తాం’ అని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ స్పష్టం చేశారు. ఆదివారం నాటి ఘటన తర్వాత జంతర్‌మంతర్‌ను పోలీసులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ఆందోళనకారులు, ఇతరులను లోపలికి అనుమతించట్లేదు.