భారతీయ స్టూడెంట్లు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నరు: మోదీ

భారతీయ స్టూడెంట్లు కొత్త ప్రపంచాన్ని  సృష్టిస్తున్నరు: మోదీ
  • నేర్చుకున్నవి సమాజానికి తిరిగివ్వడంతోనే విద్యకు సార్థకత
  • భారతిదాసన్ వర్సిటీ కాన్వొకేషన్​డేలో ప్రధాని ప్రసంగం

తిరుచిరాపల్లి:  మన దేశ స్టూడెంట్లు అద్భుతమైన నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 2014లో మన దేశం దాదాపు 4 వేల పేటెంట్లను కలిగి ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 50 వేలు దాటిందన్నారు. మన దేశ సైంటిస్టులు చంద్రయాన్ వంటి మిషన్​ల ద్వారా భారత్ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. దేశంలోని సంగీత విద్వాంసులు, కళాకారులు నిత్యం మన దేశానికి అంతర్జాతీయ అవార్డులు తెస్తున్నారని తెలిపారు. మంగళవారం తమిళనాడు, తిరుచిరాపల్లిలోని భారతి దాసన్ యూనివర్సిటీ కాన్వొకేషన్​ డేలో ప్రధాని ప్రసంగించారు.
అందరికీ విద్య, సామాజిక న్యాయం అందించాలన్న ద్రవిడుల పాలనా నమూనాను సీఎం ఎంకే స్టాలిన్ ఆచరిస్తున్నారని కొనియాడారు. ఇటీవల కన్నుమూసిన నటుడు విజయకాంత్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్​ను మోదీ గుర్తుచేసుకున్నారు.

మెరుగైన సమాజం కోసం తిరిగివ్వండి..

చదువు ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలు, జ్ఞానాన్ని సమాజానికి తిరిగివ్వడంతోనే విద్యకు సార్థకత ఏర్పడుతుందని మోదీ అన్నారు. ‘‘యువత ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనే నినాదంతో భారతి దాసన్ వర్సిటీని స్థాపించారు. యువత నైపుణ్యం, శక్తికి నిదర్శనం. వేగంగా పనిచేసే సామర్థ్యం కలిగినోళ్లు. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇదే ఉత్తమ సమయం. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా కొత్త మార్పులు, ఆవిష్కరణలు తీసుకురండి. మెరుగైన సమాజం కోసం, దేశ ప్రజల కోసం తీసుకొచ్చే ఆ మార్పులు, ఆవిష్కరణలే మిమ్మల్ని నడిపిస్తాయి”అని ప్రధాని సూచించారు. కాగా, 1982లో ఏర్పాటైన భారతి దాసన్ వర్సిటీలో ప్రసంగించిన తొలి ప్రధాని.. మోదీనే కావడం విశేషం. తమిళనాడులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత మోదీ లక్షద్వీప్​లో కూడా పర్యటించారు. తాము మత్స్యకారుల కోసం అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఐస్ ప్లాంట్  ద్వారా సీఫుడ్ ప్రాసెసింగ్​లో అనేక అవకాశాలు ఏర్పడతాయన్నారు.

నేడు కేరళలో భారీ బహిరంగ సభ

కేరళలోని త్రిసూర్​లో మహిళలనుద్దేశించి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. బుధవారం జరగనున్న ఈ సభ ద్వారా రానున్న లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.