చైనా దూకుడుకు ఇండియా దీటుగా బదులిచ్చింది

చైనా దూకుడుకు ఇండియా దీటుగా బదులిచ్చింది

యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మెచ్చుకోలు

న్యూఢిల్లీ: చైనా దుందుడుకు చర్యలకు ఇండియా దీటుగా సమాధానం ఇచ్చిందని యునైటెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మెచ్చుకున్నారు. ప్రాదేశిక వివాదాల విషయంలో చైనా రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోందని, దీనిని ప్రపంచం ఇక ఎంతమాత్రం సహించబోదని హెచ్చరించారు. తూర్పు లడఖ్‌లో ఇండియా భూభాగంలోకి చైనా చొరబాటు గురించి అడిగిన ప్రశ్నలకు పాంపియో జవాబిచ్చారు.

‘నేను ఇండియా ఫారెన్ (విదేశీ వ్యవహారాల శాఖ) మినిస్టర్ జైశంకర్‌‌తో చైనా దూకుడు చర్యల గురించి అనేక మార్లు మాట్లాడా. చైనా చాలా అగ్రెసివ్‌గా వ్యవహరించింది. అయితే ఇండియా కూడా అంతే దీటుగా బదులిచ్చింది. ఈ రీజియన్‌లో చైనా జనరల్ సెక్రటరీ జిన్‌పింగ్ తీరును ప్రపంచం ముందు ఉంచుతున్నా. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీసీపీ) దూకుడును ఈ ఒక్క ఘటనకే పరిమితం చేసి చూడలేం. దీన్ని విస్తృత స్థాయిలో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి వియత్నాం ప్రత్యేక జలాల వరకు బీజింగ్ ప్రాదేశిక వివాదాలను రెచ్చగొడుతోంది. ఈ బెదిరింపులను ప్రపంచం అనుమతించకూడదు. అలాగే ఇది కొనసాగడానికీ అవకాశం ఇవ్వకూడదు. దీన్ని ప్రెసిడెంట్ ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు’ అని పాంపియో చెప్పారు.