- పెట్టుబడులపై పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: ఓటీటీలో సినిమా చూడాలన్నా, రోడ్డు పక్కన టీ స్టాల్లో యూపీఐతో డబ్బు కట్టాలన్నా, ప్రయాణంలో ఉంటూనే తాజా వార్తలు చెప్పాలని ఏఐని కోరాలన్నా డేటా సెంటర్ నుంచి పని జరగాల్సిందే! భారీ బిల్డింగుల్లో ఉండే డేటా సెంటర్లు ఏఐకి ఆక్సీజన్ లాంటిది. ఇవి మనదేశంలో వేగంగా విస్తరిస్తూ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్నాయి.
డిజిటల్ లావాదేవీలు, ఏఐ వాడకం విపరీతంగా పెరగడం వల్ల డేటా సెంటర్ల అవసరమూ పెరుగుతోంది. అమెరికా తర్వాత ఏఐ వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచిందని తాజాగా ఓ రిపోర్ట్ తెలిపింది. 2025 జూన్– డిసెంబర్ మధ్య భారతీయ కంపెనీలు 8,230 కోట్ల ఏఐ, మెషిన్ లెర్నింగ్ లావాదేవీలు నిర్వహించడం ఒక రికార్డు. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొత్తం కార్యకలాపాల్లో 46.2 శాతం వాటాకు సమానం.
అమెజాన్ పెట్టుబడి.. రూ.3.17 లక్షల కోట్లు
ఈ భారీ డిమాండ్‌ను అందుకునేందుకు అమెజాన్ 35 బిలియన్ డాలర్లు (రూ.3.17 లక్షల కోట్లు), గూగుల్ 15 బిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించాయి.
డిజిటల్ కనెక్సియన్ సంస్థ 11 బిలియన్ డాలర్లు, కంట్రోల్ ఎస్ సంస్థ 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2026-–27 బడ్జెట్ లో గ్లోబల్ క్లౌడ్ ఆదాయంపై 2047 వరకు పన్ను మినహాయింపులు ప్రకటించడం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. డేటా సెంటర్ల రంగంలో పెట్టుబడులు రూ.18.33 లక్షల కోట్లు దాటతాయని అంచనా. ఇప్పటికే రూ.7.56 లక్షల కోట్ల ప్రతిపాదనలు అందగా, రూ.5.88 లక్షల కోట్ల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఏఐ నచ్చకుంటే వెళ్లిపోండి: ఉద్యోగులకు గూగుల్ అల్టిమేటమ్
తమ ఏఐ ప్లాన్స్ నచ్చని ఉద్యోగులు వెళ్లిపోవచ్చని గూగుల్ స్పష్టం చేసింది. ఏఐ కి అనుగుణంగా తమను తాము మార్చుకోలేని వారి కోసం వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు దీనిని ఎంచుకోవచ్చని తెలిపింది. యాడ్ ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్‌ను జీబీఓ యూనిట్ పర్యవేక్షిస్తుంది.
ఏఐ రంగం వేగంగా మారుతోంది కాబట్టి కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్‌కు అనుకూలంగా ఉండే ఉద్యోగులను మాత్రమే కోరుకుంటున్నామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ షిండ్లర్ వివరించారు. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటివీ ఇదే తరహా నిర్ణయాలను ప్రకటించాయి. సీనియర్లు ఏఐలో భాగస్వామ్యం కావాలని లేదా కంపెనీని విడిచిపెట్టాలని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
