మన దౌత్య సమస్యలు తాత్కాలికమే.!

మన దౌత్య సమస్యలు తాత్కాలికమే.!

భారతదేశ స్నేహపూర్వక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా శత్రు వైఖరిని ప్రదర్శించడంతోపాటు మన శత్రువుగా ఎందుకు మారారో  తెలియక భారతీయులు ఆశ్చర్యపోయి ఉండవచ్చు.  కానీ,  అది  అసాధారణం కాదు.  రాజకీయాల్లో లేదా విదేశాంగ వ్యవహారాల్లో ఒక దేశానికి మరో దేశంతో శాశ్వత స్నేహం లేదా శత్రుత్వం అనేదేమీ  ఉండదు. మన మొదటి ప్రధాన మంత్రి జవహర్‌‌‌‌లాల్  నెహ్రూ చైనా,  పాకిస్తాన్‌‌‌‌ల నుంచి కఠినమైన పాఠాలు నేర్చుకున్నారు.  భారతదేశం తటస్థ విధానాన్ని అనుసరించి శాంతియుతంగా ఉన్నందున  చైనా, పాకిస్తాన్  పరస్పరం భారత్​ పట్ల సానుకూలంగా  ప్రతిస్పందిస్తాయని నెహ్రూ భావించారు. వాస్తవానికి నెహ్రూ భారతదేశం పొందాల్సిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థానాన్ని చైనాకు ఇచ్చారు. ఇది భారతదేశానికి శాశ్వత నష్టాన్ని కలిగించింది. కానీ,  చైనా, పాకిస్తాన్  రెండూ భారతదేశాన్ని మోసం చేశాయి.  భారత్​తో పాక్, చైనా ఇరుదేశాల విషపూరిత శత్రుత్వం నేటికీ కొనసాగుతోంది. 

చైనాలో  అధికారం చేపట్టడానికి ముందు తనకు తెలిసిన చైనా నాయకులు భారతదేశంపై ఎప్పుడూ దాడి చేయరని  తొలి ప్రధాని జవహర్​లాల్​  నెహ్రూ భావించారు.  కానీ,  చైనీస్​ లీడర్లు నెహ్రూ నమ్మకానికి వ్యతిరేకంగా ప్రవర్తించి వారి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు.  చైనా నాయకులు భారత్​తో  స్నేహ వైఖరి అవలంబించడం కంటే.. తమ అవసరాల గురించి మాత్రమే ఆలోచించి 1962లో  భారతదేశంపై దాడి చేసి నెహ్రూ ప్రతిష్టను దెబ్బతీశారు.  అదేవిధంగా మరోవైపు నెహ్రూ 1960లో   సింధూ జలాల ఒప్పందంపై సంతకం చేసి, పాకిస్తాన్‌‌‌‌కు వెళ్లి భారతదేశం శాంతిని కోరుకుంటుందని తెలిపారు.  పాకిస్తాన్​ కూడా నెహ్రూకు నమ్మక ద్రోహం చేసింది. 1965లో చైనా సహాయంతో  పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసింది. అయితే,  పాకిస్తాన్​ను యుద్ధంలో ఓడించి భారత్​  పాకిస్తాన్​కు గొప్ప గుణపాఠం నేర్పింది.  

ఆ రెండు దేశాల నమ్మకద్రోహం

విదేశీ ఒప్పందాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1790లో  గ్రేట్​ బ్రిటన్​ ప్రధాని విలియం పిట్​ ది యంగర్​ పేర్కొన్నట్టు..‘ప్రపంచ దేశాలకు శాశ్వత స్నేహితుడు లేదా శాశ్వత శత్రువులు ఉండరు. దేశాలకు వాటి సొంత ప్రయోజనాలే ప్రధానం’.  ఇది భారతదేశానికి గొప్ప పాఠం. అదేవిధంగా మరో గొప్ప బ్రిటిష్​ ప్రధానమంత్రి విల్సన్​ 1964లో చెప్పినట్టు ఒక వారం కాల వ్యవధి రాజకీయాల్లో సుదీర్ఘ కాలం.  బ్రిటిష్​ ప్రధానమంత్రులు చెప్పిన ఈ రెండు రూల్స్​ సరైనవే. ఎందుకంటే భారత పార్లమెంటు  వ్యవస్థ బ్రిటిష్ పాలిత వ్యవస్థ  పూర్తి అనుకరణ అని చెప్పవచ్చు.  నెహ్రూ  ఈ రెండు రూల్స్​ను విస్మరించి పాకిస్తాన్​, చైనా విషయంలో  వాటి మోసాన్ని  చూశాడు.  నెహ్రూ ఆ రెండు దేశాల నాయకులతో  స్నేహపూర్వక వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉన్నట్టుగా భావించాడు. కానీ, ఆ దేశాల నాయకుల మధ్య నెహ్రూ కోరుకున్న స్నేహభావం లేదు. 

మోదీకి కఠినమైన పాఠాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ సంబంధాలలో,  ప్రపంచ దేశాల నాయకులతో  స్నేహసంబంధాల విషయంలో  మెరుగ్గానే వ్యవహరించారు. అయితే,  ఇతర  నాయకుల మాదిరిగానే  ప్రధాని మోదీ కూడా విదేశీ నేతలతో  వ్యక్తిగత స్నేహసంబంధాలను పెంచుకున్నారని అంగీకరించారు. కానీ, భారతదేశ  ప్రధాని అయినందున ఆయా దేశాల నాయకులు తన స్నేహితులయ్యారని  మోదీ మర్చిపోయారు. భారత ప్రధానమంత్రి మోదీ ఇతర దేశాల నాయకుల పట్ల ఎంత గౌరవంగా స్పందిస్తారో, అదేవిధంగా  విదేశీ నాయకులు కూడా మోదీపట్ల అంతే గౌరవంగా  స్పందిస్తారు.  అయితే, భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతృప్తిగా ఉన్నారని భావించడం పూర్తిగా మన తప్పు.  అదే వాస్తవం.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  ఇతర  దేశాల నాయకులతో కూడా అదేవిధంగా అనూహ్యంగా ప్రవర్తించారు.  డొనాల్డ్  ట్రంప్  అమెరికాకు చెందిన మిత్రదేశాలతో కూడా అదేవిధంగా ప్రవర్తించారనేది మనం గమనించాలి. 

నాటో కూటమిని బద్దలుకొడుతున్న ట్రంప్​

1945 నుంచి అమెరికా యూరోపియన్ దేశాలతో నాటో కూటమిలో ఉంది. కానీ, ట్రంప్  అక్షరాలా ఆ అలయన్స్​ను  బద్దలుకొట్టారు. అలజడి సృష్టించిన ఈ ఘటన అమెరికా  నమ్మదగినది కాదని యూరప్‌‌‌‌ అంశం తెలియజేస్తోంది. 1945 నుంచి  దక్షిణ కొరియా,  జపాన్‌‌‌‌లకు  అమెరికా మిత్రదేశంగా ఉంది.  అమెరికన్ దళాలు రెండు దేశాలలోనూ మోహరించాయి.  కానీ,  ట్రంప్ ఈ దేశాలకు సంబంధించి దక్షిణ కొరియా, జపాన్‌‌‌‌లను  తమ అధీనంలో ఉన్న ప్రాంతాలుగా  భావించినట్లే  వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో భారత్‌‌‌‌పై  ట్రంప్  సుంకాల  వార్ ​ గురించి  వాస్తవానికి ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది పరిష్కరించగల సమస్యగా చెప్పవచ్చు.  కాలం ఈ సమస్యను పరిష్కరిస్తుంది. భారతదేశం ఇంతకు ముందు అమెరికాతో  ఇంతకంటే చాలా పెద్ద సమస్యలను ఎదుర్కొంది.

ట్రంప్  పాక్‌‌‌‌ను ఎందుకు సమర్థిస్తున్నాడు?

తమ విజయాలకు తోడుగా ఉండే దేశాలతో  ఆయా దేశాలు మంచి సంబంధాలు కలిగి ఉంటాయని భారత్​  గుర్తించాలి.  అమెరికా పాకిస్తాన్‌‌‌‌తో మంచి సంబంధాన్ని కలిగి ఉండటాన్ని మనం వ్యతిరేకించలేం.  మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే  పాకిస్తాన్​  చైనాకు అత్యంత  సన్నిహిత మిత్రదేశం.  చైనా, అమెరికా దేశాల మధ్య పాకిస్తాన్​ మధ్యవర్తిగా వ్యవహరించగలదని ట్రంప్​ భావించి ఉండవచ్చు. ఖతార్ వంటి దేశాలు కూడా పాకిస్తాన్​ ఉన్నతికి దోహదపడాలని అమెరికాను  కోరి 
ఉండవచ్చు. 

విదేశీ సంబంధాలను విస్తరించాలి

మోదీ, మన నాయకులు కూడా  తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే  అమెరికాతోనే కాకుండా భారతదేశం ఇతర దేశాలతో  కూడా శాశ్వత స్నేహం పెంచుకోవచ్చు.  ధనిక, శక్తిమంతమైన దేశాలకు  విదేశాంగ  మంత్రులు ఉన్నారు.  భారత్ వంటి దేశాలు ఆ దేశాలతో విస్తృత విదేశీ సంబంధాలను కొనసాగించవచ్చు. భారతదేశం విస్తారమైన మార్కెట్​ను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తమ సేవలను విస్తరించాలి. అమెరికాలో ప్రతి పెద్ద విశ్వవిద్యాలయం ఏదో ఒక దేశం గురించి అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని కలిగి ఉంటుంది.

 ఆ విధంగా అమెరికా ప్రభుత్వానికి వెంటనే తగిన సమాచారం అందుతుంది. ఈ విషయంలో మన యూనివర్సిటీల్లో అలాంటి కార్యక్రమాలు లేవు.  విదేశీ సంబంధాలపై మన రాజకీయ నేతలు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన దేశానికి ఉంది.  కాలక్రమేణా భారతదేశానికి అమెరికాతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కొంతకాలం మాత్రమే తుపాను సముద్రంలో ఉంటుంది. మనం అమెరికా విధానం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే ఆలోచించాలి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్  చైనా, పాకిస్తాన్​ గురించి చెప్పిన విషయాన్ని నేను స్వయంగా విన్నాను.  ఒకవేళ భారతదేశం పదేండ్లలో పదిశాతం అభివృద్ధిని నమోదు చేస్తే భారత్​కు శత్రుదేశం ఉండదు. ఆయన మాటల ఉద్దేశం ఏమిటంటే మన దేశం ధనిక దేశంగా మారితే ప్రతి ఒక్కరూ మనతో స్నేహంగా ఉంటారు. దేశాలు కూడా ప్రజలు లాంటివే. ధనికులతో స్నేహంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. 

ట్రంప్​తో మళ్లీ స్నేహం కుదరొచ్చు!

భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ భారత్​, పాకిస్తాన్​ మధ్య శాంతి ఒప్పందం కోసం పట్టుబడుతున్నాడు.  భారత్​  అమెరికా నాయకులతో మాట్లాడి ఉండొచ్చు.  వారు పాక్​ యుద్ధాన్ని కొనసాగించవద్దని హెచ్చరించి ఉండొచ్చు.  ట్రంప్​కు క్రెడిట్​ ఇవ్వడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.  ట్రంప్​కు  క్రెడిట్  ఇవ్వాలా  వద్దా అనే దానిపై చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కానీ,  నా అభిప్రాయం ప్రకారం  ట్రంప్  నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని భారతదేశం చెప్పినంతనే ఆకాశం ఊడిపడదు. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ  ట్రంప్‌‌‌‌తో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించే  అవకాశం ఉంది.  

- డా. పెంటపాటి పుల్లారావు, 
పొలిటికల్​ ఎనలిస్ట్​