న్యూఢిల్లీ: భారతదేశం 2025–26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో) 418.91 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేసింది. గతేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే 5.86శాతం వృద్ధి నమోదైంది. 2024–25లో మొత్తం ఎగుమతులు 825.25 బిలియన్ డాలర్లకు చేరగా, ఏడాది లెక్కన 6.05శాతం గ్రోత్ నమోదయ్యింది. ముఖ్యంగా సేవల రంగం 13 శాతం వృద్ధితో 387.54 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్– సెప్టెంబర్‌లో సేవల ఎగుమతులు 199.03 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఏడాది లెక్కన 9.34శాతం వృద్ధి చెందాయి. వస్తువుల ఎగుమతులు 2.9 శాతం పెరిగి 219.88 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. వస్తువుల ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంజినీరింగ్, ఔషధాలు, సముద్ర ఉత్పత్తులు, బియ్యం ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. అమెరికా, యూఏఈ, చైనా, స్పెయిన్, హాంకాంగ్‌కు మన ఎగుమతులు పెరిగాయి. సోలార్ ప్యానెల్ ఎగుమతులు ఏప్రిల్–అక్టోబర్‌లో ఏడాది లెక్కన 30.7శాతం పెరిగి 932 మిలియన్ డాలర్లకు చేరాయి. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియాతో ట్రేడ్ ఒప్పందాలు కుదిరితే ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

