- దేశంలోనే మొదటి అగ్రి రోబోటిక్స్ ల్యాబ్ ప్రారంభం
- ఎస్బీఐ సహకారంతో పీజేటీఏయూలో ఏర్పాటు
- 2030 నాటికి పొలాల్లో మానవరహిత ట్రాక్టర్లు ఉంటాయన్న వీసీ
గండిపేట, వెలుగు: మానవ రహిత వ్యవసాయ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ వర్శిటీ (పీజేటీఏయూ) తొలి అడుగు వేసింది. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటిసారిగా పీజేటీఏయూలో అధునాతన అగ్రి రోబోటిక్స్ ల్యాబ్(తొలి దశ)ను ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఈ ల్యాబ్ఏర్పాట్లు చేసినట్లు చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. పూర్వ విద్యార్థిగా వర్సిటీకి తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఏడాది కింద వీసీ జానయ్య.. డీన్ జెల్లా సత్యనారాయణతో కలిసి రోబోటిక్స్ ల్యాబ్ప్రతిపాదనను తన వద్దకు తెచ్చినట్లు చెప్పారు. భవిష్యత్ వ్యవసాయానికి అవసరమైన సాంకేతికత అందించేందుకు ఈ ల్యాబ్ తోడ్పడుతుందని, అందుకే ఎస్‌బీఐ ఫౌండేషన్ ద్వారా అగ్రి హబ్‌కు సాయం అందించినట్లు వివరించారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఏఐ డ్రోన్లు, రోబోటిక్స్ కీలకమన్నారు. ఏడాదిలోనే మొదటి దశ అధునాతన ల్యాబ్‌ను ఏర్పాటు చేసినందుకు విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది, ఎస్‌బీఐ ఫౌండేషన్ ప్రతినిధుల్ని ఆయన అభినందించారు.
భవిష్యత్ వ్యవసాయం ఏఐతోనే..
వీసీ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ..2047 వికసిత్ భారత్, తెలంగాణ రైజింగ్ లక్ష్యాల్లో వ్యవసాయం కీలకమని, భవిష్యత్ వ్యవసాయం ఏఐ ఆధారిత సాంకేతికతపై ఆధారపడుతుందన్నారు. 2030–-35 నాటికి తెలంగాణ పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవరహిత ట్రాక్టర్లు విస్తృతంగా వినియోగమవుతాయని అంచనా వేశారు. కార్యక్రమంలో ఏజీ హబ్ ఎండీ డాక్టర్ జి. వెంకటేశ్వర్లు, ఏఆర్‌ఐఎస్‌ఏ ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, ఎస్‌బీఐ సీజీఎం ఎస్. రాధాకృష్ణన్, ఫౌండేషన్ ఎండీ జగన్నాథ్ సాహూ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
