భారత తొలి ప్రధాని బోస్..: కంగన

భారత తొలి ప్రధాని బోస్..: కంగన

న్యూఢిల్లీ :  నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.."మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లారు..?" అని అన్నారు. యాంకర్ ఆమెను సరిచేసేందుకు ప్రయత్నించగా.. కంగన వినిపించుకోలేదు. ముందు తన ప్రశ్నకు జవాబు చెప్పాలన్నారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో  విమర్శలకు దారితీయగా.. మరో వైపు ఇప్పటిదాకా అంతగా తెలియని ఓ చారిత్రక సంఘటనను కూడా వెలుగులోకి తెచ్చింది. నేతాజీగా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సుభాశ్ చంద్రబోస్ 1943 అక్టోబర్ 21న సింగపూర్‌లో ఆజాద్ హింద్ (ఫ్రీ ఇండియా) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో  తనను తాను ప్రధాని, దేశాధినేతగా ప్రకటించుకున్నారని చరిత్ర చెబుతోందన్నారు.

స్వాతంత్ర్య పోరాటానికి పెద్ద ఊపు

ఆజాద్ హింద్ ప్రభుత్వంలోని మహిళా సంస్థకు కెప్టెన్ డాక్టర్ లక్ష్మీ స్వామినాధన్ మంత్రిగా  బాధ్యతలు నిర్వహించగా.. మహిళా సైనికుల బ్రిగేడ్ అయిన ఝాన్సీ రాణి  రెజిమెంట్‌కు కూడా ఆమే నాయకత్వం వహించారని చరిత్ర వివరిస్తున్నది. ఝాన్సీ రాణి  రెజిమెంట్ ఆసియాలో మొదటి మహిళా యుద్ధ రెజిమెంట్ గా గుర్తింపు పొందింది. 'ఆజాద్ హింద్ సర్కార్' మన దేశ పౌరులపై, సైనిక సిబ్బందిపై అధికారాన్ని ప్రకటించుకుంది. అయితే, దాన్ని బ్రిటన్ ఆక్రమించింది. కానీ, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుభాశ్ చంద్రబోస్ చేసిన 'ఆజాద్ హింద్ సర్కార్' అనే సాహసోపేతమైన చర్య కూడా  స్వాతంత్ర్య పోరాటానికి పెద్ద ఊపును తీసుకొచ్చిందని చరిత్ర చెబుతున్నది. ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నేతాజీ కేవలం భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా  స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారందరికీ స్ఫూర్తిదాయకం. బలమైన అవిభాజ్య భారత్ కోసం విజన్ అందించడంలో  ఆజాద్ హింద్ ప్రభుత్వం పాత్ర ప్రశంసనీయం" అని కొనియాడారు.