- నవంబర్‌లో 2.5 బిలియన్ డాలర్లకు చేరిన ఎక్స్‌పోర్ట్స్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 20శాతం పెరిగి 2.5 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది నవంబర్‌లో ఈ నెంబర్ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్–నవంబర్ కాలంలో రత్నాలు, ఆభరణాల మొత్తం ఎగుమతులు 18.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే టైమ్‌లో నమోదైన 18.85 బిలియన్ డాలర్లతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ఎగుమతులు నవంబర్‌లో 919.74 మిలియన్ డాలర్లకి (గత ఏడాది 666.34 మిలియన్ డాలర్ల నుంచి) పెరగగా, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ 10.55శాతం పెరిగి 76.09 మిలియన్ డాలర్లకి చేరాయి. గోల్డ్ జ్యువెలరీ ఎగుమతులు 1.21 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. డిమాండ్ పెరగడంతో స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ ఎగుమతులు నవంబర్‌లో 828.89 మిలియన్ డాలర్లకి ఎగిశాయి. గత ఏడాది నవంబర్‌లో 555.39 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. సిల్వర్ జ్యువెలరీ ఎగుమతులు గతేడాది నవంబర్‌లో నమోదైన 63.99 మిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది నవంబర్‌లో 197.97 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ‘‘రత్నాలు, ఆభరణాలకు హాంకాంగ్, చైనా, మిడిల్ ఈస్ట్‌లో డిమాండ్ పెరుగుతోంది. అమెరికాలో మందగమనం ఉన్నా, ఇతర మార్కెట్లలో బలమైన డిమాండ్ వృద్ధికి తోడ్పడుతోంది. సిల్వర్ బులియన్ సరఫరా మళ్లీ అందుబాటులోకి రావడంతో వెండి ఎగుమతులు ఊపందుకున్నాయి” అని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీఏఈపీసీ) చైర్మన్ కిరిత్ భన్సాలీ
అన్నారు.
