ఆ దేశం అరాచకాలకు పాల్పడుతోంది : రాజ్ నాథ్ సింగ్

 ఆ దేశం అరాచకాలకు పాల్పడుతోంది : రాజ్ నాథ్ సింగ్

శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఆ దేశం అరాచకాలకు పాల్పడుతోందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని పాకిస్తాన్ ను హెచ్చరించారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పరోక్షంగా చెప్పారు. గురువారం జమ్మూకాశ్మీర్ లోని బుద్గాంలో నిర్వహించిన శౌర్య దివస్ లో రాజ్ నాథ్ పాల్గొన్నారు. దేశం ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు తమ ప్రాణాలను అర్పించిన సైనిక వీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడారు. వీరుల ధైర్యసాహసాలు, త్యాగాల కారణంగానే జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా మిగిలిపోయిందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ లో అభివృద్ధి లక్ష్యాలు పీవోకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్ ల స్వాధీనంతోనే పూర్తవుతాయని ఆయన చెప్పారు. ‘‘జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పుడే అభివృద్ధి ప్రయాణం మొదలుపెట్టాం. గిల్గిత్, బాల్టిస్తాన్ ల స్వాధీనంతో మా లక్ష్యం నెరవేరుతుంది” అని రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత నుంచీ జమ్మూకాశ్మీర్ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని అన్నారు. దశాబ్దాలుగా ఎన్నో దాడులతో ప్రజలు ప్రశాంతతను కోల్పోయారని, వివక్షను ఎదుర్కొన్నారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసేవరకు ఆ పరిస్థితి కొనసాగిందన్నారు. బీజేపీ సర్కారు హయాంలోనే కాశ్మీర్​లో శాంతి, పురోగతి అనే కొత్త శకం ప్రారంభమైందని రాజ్​నాథ్ అన్నారు.

ఏంటీ శౌర్య దివస్? 

స్వాతంత్ర్యం వచ్చినంక మన దేశంపై జరిగిన తొలి దాడిని 1947 అక్టోబర్ 27న సైన్యం తిప్పికొట్టింది. సిక్కు రెజిమెంట్ మొదటి బెటాలియన్ అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి, పాకిస్తాన్ బలగాలను ఓడించింది. ఇదే రోజు శ్రీనగర్ ఎయిర్ బేస్ లో ఎయిర్ ఫోర్స్ విమానం ల్యాండ్ అయింది. దీనికి గుర్తుగా ప్రతిఏటా అక్టోబర్ 27న ఆర్మీ ‘‘ఇన్ ఫాంట్రీ డే” నిర్వహిస్తోంది. మరోవైపు ఎయిర్ బేస్ ఏర్పాటు చేసి గురువారం నాటికి 50 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో శౌర్య దివస్ నిర్వహించారు.

పాక్ ది మొసలి కన్నీరు... 

టెర్రరిజానికి మతం లేదని, ఇండియాను టార్గెట్ చేయడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని రాజ్ నాథ్ అన్నారు. ‘‘కాశ్మీరీయత్ పేరుతో జమ్మూకాశ్మీర్ లో జరిగిన టెర్రర్ దాడులు వర్ణించలేనివి. గత కొన్నేండ్లుగా టెర్రరిస్టులను అంతం చేసేందుకు మేం చర్యలు తీసుకొంటుంటే.. మేధావులుగా చెప్పుకునే కొందరు మానవ హక్కుల ఉల్లంఘన అంటూ గగ్గోలు పెడుతున్నారు. పీవోకేలో అరాచకాలకు పాల్పడుతున్న పాకిస్తాన్.. జమ్మూకాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మొసలి కన్నీరు కారుస్తోంది. పీవోకే ప్రజల బాధలు వాళ్లనే కాదు.. మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి” అని అన్నారు. కాగా, ఆర్మీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను రాజ్ నాథ్ సందర్శించారు. కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బ్రిగేడియర్ రాజిందర్ సింగ్ కూతురు ఉషా శర్మ, ఇతర అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.