
- ధరలు పెరగడమే కారణం!
న్యూఢిల్లీ: భారతదేశ బంగారం నిల్వల విలువ తొలిసారిగా వంద బిలియన్ డాలర్ల (8.8 లక్షల కోట్ల) మార్క్‌ను దాటి 102.365 బిలియన్ డాలర్ల (రూ.9 లక్షల కోట్ల)కు చేరాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, గోల్డ్ రేట్లు పెరగడం వలన ఇండియా బంగారం నిల్వల విలువ భారీగా పెరిగింది. గత కొన్నేళ్లుగా రిజర్వ్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లను పెంచినప్పటికీ, ఈ ఏడాది మాత్రం తగ్గించింది.
ఈ నెల 10 నాటికి ఇండియా మొత్తం ఫారెక్స్ రిజర్వుల్లో బంగారం వాటా 14.7శాతానికి పెరిగింది. ఇది 1996–97 తర్వాత అత్యధికం. గత దశాబ్దంలో బంగారం వాటా 7శాతం నుంచి 15శాతానికి అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. ఆర్‌బీఐ స్థిరంగా కొనుగోలు చేయడం, బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం.
ఈ ఏడాది ఆర్‌బీఐ కేవలం 4 నెలల్లో మాత్రమే బంగారం కొనుగోలు చేసింది. గత ఏడాది 9 నెలల్లో 50 టన్నులు కొనుగోలు చేసిన దానితో పోలిస్తే ఇది బాగా తక్కువ. బంగారం ధరలు ఈ ఏడాది 65శాతం పెరగడం వల్ల విలువ ఆధారంగా రిజర్వులు పెరిగాయి.