- ఆరోగ్య సంరక్షణ రంగానికి ఆకాశమే హద్దు..
- 2030 నాటికి విలువ రూ.58 లక్షల కోట్లకు
- రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశాలు
- అసంఘటిత రంగంలోనే ఎక్కువ ఆస్పత్రులు
- ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ: మనదేశ ఆరోగ్య సంరక్షణ రంగం జెట్స్పీడ్తో దూసుకెళ్తోంది. ఇది 2030 నాటికి రూ.58.8 లక్షల కోట్లు (700 బిలియన్ డాలర్ల) స్థాయికి చేరుకోవచ్చని వెల్లడయింది. అయితే ఆరోగ్య ఆర్థిక వ్యవస్థ ఇంకా అసంఘటితంగానే ఉందని ఒక రిపోర్ట్ వెల్లడించింది. నెట్హెల్త్, ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ రూపొందించిన 'ఇండియా హెల్త్ ఫైనాన్సింగ్ పొజిషన్ పేపర్ 2026' ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ ఆరోగ్య వ్యవస్థ విలువ సుమారు రూ.25.2 లక్షల కోట్లుగా ఉంది. ఇది 2030 నాటికి రూ.58.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచం మొత్తమ్మీద అనారోగ్యం వల్ల కలిగే నష్టంలో ఐదింట ఒక వంతు మన దేశంలోనే జరుగుతోంది. అయితే, ప్రపంచ ఆరోగ్య వ్యయంలో మన దేశ వాటా ఒక శాతం మాత్రమే ఉంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో 2035 నాటికి రూ.16.8 లక్షల కోట్లు కంటే ఎక్కువ పెట్టుబడులు అవసరమవుతాయి. ప్రతి రూ.8.4 కోట్ల పెట్టుబడికి 27 వరకు ఉద్యోగాలు లభిస్తాయి.
బీమా లేక పరేషాన్
వైద్య ఖర్చుల కోసం 44 శాతం మంది భారతీయులు తమ సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దేశంలో 60 శాతం మందికి మాత్రమే ఏదో ఒక రూపంలో బీమా రక్షణ ఉంది. ఇందులో 40 శాతం ప్రభుత్వ పథకాల ద్వారా ఉండగా.. 20 శాతం మాత్రమే ప్రైవేటు బీమా ఉంది. దాదాపు 43 కోట్ల మందికి ఇప్పటికీ బీమా ధీమా లేదు. వీళ్లు ప్రభుత్వ పథకాలకు అనర్హులే గాక, ప్రైవేటు బీమానూ కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు.
డిజిటల్, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా వైద్య అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని ఎక్స్పర్టులు చెబుతున్నారు. మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ప్రమోటర్, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అమీరా షా మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తేనే ఆరోగ్య రంగంలో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మెజారిటీ ప్రజలకు ప్రైవేటు రంగమే ఆరోగ్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది. ఈ రెండు రంగాలు తమ జ్ఞానాన్ని పంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని ఆమె వివరించారు.
మౌలిక వసతుల కొరత
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య రంగం సామాజిక ఆర్థిక ఇంజిన్‌గా మారుతోందని చెప్పారు. డాక్టర్లు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారని.. ప్రపంచ దేశాలతో పోలిస్తే పదింట ఒక వంతు ధరకే భారత్‌లో నాణ్యమైన చికిత్స అందుతోందని వివరించారు. భారత్ ప్రపంచానికి ఫార్మసీగా మాత్రమే కాకుండా, ఆరోగ్య సేవల ప్రొవైడర్గానూ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రస్తుతం ప్రతి వెయ్యి మందికి 0.9 మంది డాక్టర్లు, 1.8 మంది నర్సులు, 1.6 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2035 నాటికి అదనంగా పది లక్షల మంది డాక్టర్లు, 35 లక్షల మంది నర్సులు, 14 లక్షల బెడ్ల అవసరం ఉంటుంది. అసంక్రమిత వ్యాధులు (ఎన్సీడీ) 2.9 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలను భారీగా పెంచాలని ఈ రిపోర్ట్ సూచించింది.
