హాంకాంగ్​ను దాటేసిన ఇండియా స్టాక్​మార్కెట్

హాంకాంగ్​ను దాటేసిన ఇండియా స్టాక్​మార్కెట్
  •     నాలుగో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌ మనదే

న్యూఢిల్లీ :  భారత స్టాక్ మార్కెట్ హాంకాంగ్‌ను అధిగమించి తొలిసారిగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా ఎదిగింది.  భారతీయ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన కంపెనీల షేర్ల మొత్తం విలువ సోమవారం ముగింపు నాటికి 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. హాంకాంగ్ మార్కెట్లోని కంపెనీ స్టాక్​ల విలువ 4.29 ట్రిలియన్ డాలర్లు ఉంది. భారతదేశ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 5న మొదటిసారిగా నాలుగు ట్రిలియన్‌ డాలర్లను దాటింది. వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్​ఐఐలు) నుంచి నిరంతర ఇన్‌ఫ్లోలు

బలమైన కార్పొరేట్ ఆదాయాలు వల్ల భారతీయ స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ వచ్చింది.  మనదేశం చైనాకు ప్రత్యామ్నాయంగా నిలిచింది. ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి,  కంపెనీల నుంచి తాజా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఉండటం, వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వల్ల మార్కెట్లకు మేలు జరుగుతోంది.  హాంకాంగ్ మార్కెట్లు పడిపోతున్నాయి.

చైనీస్,  హాంకాంగ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ 2021లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి ఆరు ట్రిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది.   కఠినమైన యాంటీ -కోవిడ్ -19 నియంత్రణలు, కార్పొరేషన్లపై అణిచివేతలు, రియల్టీ సంక్షోభం,  పశ్చిమ దేశాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చైనాను దెబ్బతీశాయి. హాంకాంగ్‌లో మార్కెట్లో కొత్త లిస్టింగ్స్​ కూడా తగ్గిపోయాయి.