
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,975 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకుర మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,917కు చేరుకుందని తెలిపింది. అలాగే కొత్తగా 47 మరణించడంతో దేశ వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 826కు పెరిగిందని వెల్లడించింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 5914 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ప్రస్తుతం 20,177 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.
మరో రాష్ట్రంలో పేషెంట్లంతా డిశ్చార్జ్
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల రోజు రోజుకూ పెరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలు వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి. కొత్త కేసుల రాకుండా కంట్రోల్ చేయడంతో పాటు జీరో మరణాలతో.. ఆస్పత్రిలో చేరిన పేషెంట్లందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే గోవా (7), మణిపూర్ (2), అరుణాచల్ ప్రదేశ్ (ఒక్క పేషెంట్) రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన పేషెంట్లంతా కోలుకుని సేఫ్ గా ఇళ్లకు చేరగా.. ఇవాళ త్రిపుర కూడా ఈ జాబితా చేరింది. త్రిపురలో మొత్తం ఇద్దరికి కరోనా వైరస్ సోకగా.. వారిరువురికీ వ్యాధి పూర్తిగా నయమై డిశ్చార్జ్ అయ్యారు.
వెయ్యి కేసులకు చేరువలో తెలంగాణ
దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 7628 కరోనా కేసుల నమోదు కాగా, 323 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఆ రాష్ట్రంలో 3071 మంది వైరస్ బారినపడగా.. 133 మంది మరణించారు. ఢిల్లీలో 2625, మధ్యప్రదేశ్ లో 2096, రాజస్థాన్ లో 2083 కరోనా కేసుల నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో 1843, తమిళనాడులో 1821 మందికి వైరస్ సోకింది. ఏపీలో 1097 కరోనా కేసుల నమోదు కాగా, తెలంగాణలో 991 మంది వైరస్ బారినపడ్డారు.