ఉద్యోగం చేస్తూ 30% పన్ను కడుతున్నారా..? ధనవంతుల 'టాక్స్ సీక్రెట్' ఇదే..

ఉద్యోగం చేస్తూ 30% పన్ను కడుతున్నారా..? ధనవంతుల 'టాక్స్ సీక్రెట్' ఇదే..

ఆదాయపు పన్ను నిర్థేశించిన పరిమితులకు మించి ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందే. దీనిలో ఎక్కువగా శాలరీర్డ్ ఉద్యోగులు చేతికి జీతం అందుకోవటానికి ముందే కట్టింగ్స్ చూస్తుంటారు. ఎక్కువ ప్యాకేజీ ఉన్న వారు ఏడాదికి 30 శాతం వరకు పన్నుల రూపంలోనే కట్టాల్సి వస్తోందని బాధపడుతున్న సంగతి తెలిసిందే. కానీ వీరి కంటే ఎక్కువ సంపాదిస్తున్న అల్ట్రా రిచ్ మాత్రం తక్కువ టాక్సులు లేదా సున్నా టాక్సులు కడుతున్నారు. అయితే దీని వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో వ్యవసాయం అంటే కష్టపడే అన్నదాత, అప్పుల ఊబి, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం అనే వాస్తవాలే చాలా మందికి తెలుసు. కానీ అత్యంత ధనవంతుల దృష్టిలో వ్యవసాయం అనేది చట్టబద్ధంగా పన్ను ఎగవేసేందుకు ఒక 'క్లీన్ ట్రిక్'గా మారింది. ఈ విషయం చాలా మంది సామాన్య ప్రజలకు తెలియదు. జీతంపై ఆధారపడి జీవించే ఉద్యోగులు 30% వరకు పన్ను చెల్లిస్తుంటే, చాలా మంది బడా బాబులు మాత్రం తమను తాము రైతులుగా చూపుతూ సున్నా పన్ను చెల్లిస్తున్నారు. అయితే ఇదెలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..

సున్నా పన్ను వెనుక ఉన్న రహస్యం..

భారతదేశంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను సున్నాగా ఉంచబడింది. ఇది నిజమైన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు. కానీ.. అపార సంపద ఉన్న వ్యక్తులు, సెలబ్రిటీలు చట్టంలోని ఈ లొసుగును అడ్డం పెట్టుకుని తమ ఆదాయాన్ని వ్యవసాయం నుంచి వచ్చినట్లుగా చూపి, పన్ను కట్టడం నుంచి తప్పించుకుంట్లు ఇన్వెస్టర్ ఆశిష్ కుమార్ మెహర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఆశిష్ కుమార్ మెహర్ పోస్టు ప్రకారం.. షారుఖ్ ఖాన్ అలీబాగ్‌లోని తన భూమిని వ్యవసాయ భూమిగా చూపించారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనకు రూ.3.09 కోట్ల జరిమానా కూడా విధించబడిందన్నారు.ఆయన కుమార్తె సుహానా ఖాన్ సైతం రూ.12.91 కోట్ల విలువైన వ్యవసాయ స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తన 'రైతు' హోదాను నిలబెట్టుకోవడానికి కోర్టులో న్యాయపోరాటం కూడా చేశారు. ఇవి వ్యవసాయ భూమిని పన్ను ఆదా కోసం ధనవంతులు ఎలా వినియోగిస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి.

పంటలే పండని నగరాల్లో 'కోటీశ్వరుల రైతులు'..

దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరాల్లో వ్యవసాయానికి పెద్దగా ఆస్కారం లేదు. అయినప్పటికీ ఈ ఒక్క నగరంలోనే 275 మంది తమను తాము 'కోటీశ్వరుల రైతులు'గా ప్రకటించుకున్నారు. వీరందరూ పన్ను లేకుండా సంపాదిస్తున్నవారే కావటం గమనార్హం. 2007 నుంచి 2015 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 2,746 మంది తాము వ్యవసాయం ద్వారా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించినట్లుగా చూపించారు. ఇందులో ఎక్కువ మంది ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచే ఉన్నారు. ఈ మహానగరాల్లో పెద్ద ఎత్తున సాగు చేయడం అసాధ్యం అన్న విషయం తెలిసినప్పటికీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

ఒకవైపు దేశంలోని అనేక ప్రాంతాల్లో నిజమైన రైతులు అప్పుల్లో కూరుకుపోయి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే.. మరోవైపు ధనవంతులు రైతులకు ఉపయోగపడాల్సిన లొసుగును వాడుకుని సులభంగా పన్ను నుంచి తప్పించుకోవడం వ్యవస్థలోని అసమానతలను, లోపాలను స్పష్టంగా తెలియజేస్తోంది.