
- ఫైనల్లో బంగ్లాపై ఘన విజయం
- సత్తాచాటిన కనిక, శ్రేయాంక
మాంకాక్ (హాంకాంగ్): ఇండియా యంగ్ క్రికెటర్లు మరోసారి తమ సత్తా చూపెట్టారు. విమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో మన అమ్మాయిలు చాంపియన్లుగా నిలిచారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చిన కనిక అహూజ (23 బాల్స్‌లో 4 ఫోర్లతో 30 నాటౌట్; 2/23) ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌కు తోడు , అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ స్టార్ శ్రేయాంక పాటిల్ (4/13) సూపర్ స్పిన్‌తో ఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి కప్పు సొంతం చేసుకున్నారు. బుధవారం జరిగిన టైటిల్ ఫైట్‌లో ఇండియా 31 రన్స్ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 127/7 స్కోరు చేయగలిగింది. దినేశ్ వ్రిందా (29 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36), కనిక రాణించారు. బంగ్లా బౌలర్లలో నహిదా అక్తర్, సుల్తానా ఖాతున్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఇండియా బౌలర్ల దెబ్బకు బంగ్లా 19.2 ఓవర్లలో 96 రన్స్‌కే ఆలౌటై ఓడిపోయింది. నహిదా అక్తర్ (17 నాటౌట్) టాప్ స్కోరర్. మన్నత్ కశ్యప్ 3 వికెట్లు పడగొట్టింది. కనికకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, శ్రేయాంకకు ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డులు దక్కాయి. ఈ టోర్నీలో ఇండియా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. గ్రూప్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 9 వికెట్లతో నెగ్గింది. గ్రూప్ దశలో నేపాల్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లతో పాటు శ్రీలంకతో సెమీఫైనల్ కూడా వాన వల్ల రద్దయింది.
ఆదుకున్న వ్రిందా, కనిక
ఈ టోర్నీలో ఇండియా యంగ్‌స్టర్స్‌తో బరిలోకి దిగగా బంగ్లాదేశ్ జట్టు సీనియర్లతో ఆడింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న స్పిన్నర్లు నహిదా, సుల్తాన్ ఖాతున్ మన బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే వ్రిందా, కనిక జట్టును ఆదుకున్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ (13), ఉమ ఛెత్రి (22)తో తొలి వికెట్‌కు 28 రన్స్ జోడించింది. కానీ, ఆరో ఓవర్లో నహిదా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. తర్వాతి ఓవర్లోనే 4,6తో స్పీడ్ పెంచిన ఉమను రబెయా ఔట్ చేసి దెబ్బకొట్టింది. ఈ దశలో వ్రిందా వెంటవెంటనే రెండు ఫోర్లు, సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా.. సుల్తానా వేసిన 13వ ఓవర్లో త్రిష (4) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరింది. స్పీడ్‌గా ఆడే ప్రయత్నంలో వ్రిందా కూడా ఔట్ అవడంతో 15 ఓవర్లకు ఇండియా 94/4తో నిలిచింది. అయితే అప్పటిదాకా జాగ్రత్తగా ఆడిన కనిక చివరి ఓవర్లో మూడు ఫోర్లు సహా 14 రన్స్ రాబట్టిన జట్టుకు గౌరవప్రద స్కోరు అందించింది.
స్పిన్‌తో పడగొట్టారు
ఛేజింగ్‌లో ఇండియా స్పిన్ త్రయం శ్రేయాంక, మన్నత్ కశ్యప్, కనిక ముప్పేట దాడికి బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడారు. తన తొలి స్పెల్‌లోనే ఓపెనర్లు దిలార (5), షాతి రాణి (13)ని ఔట్ చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మన్నత్ బంగ్లాను దెబ్బకొట్టింది. ఆ వెంటనే కెప్టెన్ లతా మోండల్ (4), ముర్షిదా (1)ను శ్రేయాంక పెవిలియన్ చేర్చడంతో బంగ్లా 37/4తో డీలా పడ్డది. కాసేపు పోరాడిన సొభాన (16) కనిక వేసిన పదో ఓవర్లో ఐదో వికెట్‌గా ఔటైంది. నహిదా (17 నాటౌట్) క్రీజులో నిలిచినా అవతలి ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. సంజిదా (2)ను పేసర్ టిటాస్ ఔట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది.
విజయంలో మన త్రిష
అండర్19 వరల్డ్ కప్ నెగ్గిన హైదరాబాదీ గొంగడి త్రిష ఆసియా కప్ విక్టరీలోనూ భాగమైంది. ఫైనల్లో 4 రన్స్మాత్రమే చేసిన త్రిష ఫస్ట్ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. హాంకాంగ్‌తో పోరులో 13 బాల్స్‌లోనే రెండు ఫోర్లు, సిక్స్‌తో 19 రన్స్ చేసింది. సిక్స్‌తో మ్యాచ్ ఫినిష్ చేసింది. త్రిష మెరుపులతో ఇండియా 35 రన్స్ టార్గెట్‌ను 5.2 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ఫలితంగా రన్‌రేట్ పెరిగింది. దాంతో శ్రీలంకతో సెమీస్ రద్దయినా.. మంచి రన్‌రేట్ తో ఇండియా ఫైనల్ చేరింది.