
- టారిఫ్ నోటీసులను పంపరని అంచనా
న్యూఢిల్లీ: తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అమెరికా, ఇండియా చాలా నెలలుగా పనిచేస్తున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఇండియాపై వేసే సుంకాలను 26 శాతం నుంచి 20 శాతం దిగువకు తీసుకొచ్చే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. సుంకాలు పెంచే నోటీసులు అమెరికా నుంచి ఈ వారం రావని, ఒప్పందం అధికారిక ప్రకటన ద్వారా వెల్లడి కావచ్చొని అన్నారు. అదే జరిగితే ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఇండియా కొంత బెటర్ పొజిషన్‌లో ఉంటుంది.
పూర్తి స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలు కొనసాగించొచ్చు. ఈ ఏడాది చివర్లో పూర్తి స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మార్గం సుగమమవుతుంది. సుంకాలు 20శాతం కంటే తక్కువగా ఉంటాయి. తుది ఒప్పందంలో మరిన్ని సర్దుబాట్లకు అవకాశం ఉంటుంది. అయితే, పూర్తి స్థాయి ఒప్పందం ఎప్పుడు ఖరారవుతుందో క్లారిటీ లేదు. తాత్కాలిక ఒప్పందం ఖరారైతే, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని దేశాల జాబితాలో ఇండియా చేరుతుంది. కాగా, ఇండియన్ ప్రొడక్ట్‌లపై 26శాతం సుంకాలను విధిస్తామని గతంలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేశారు. తాజాగా ఈ నెల చివరి వరకు టైమ్ ఇచ్చారు.
ఈ టైమ్‌లో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు చూస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే చాలా దేశాలపై టారిఫ్‌లను 50శాతం వరకు విధిస్తున్నట్టు అధికారిక లెటర్స్‌ను పంపింది. భారత్ ఇప్పటివరకు ఇటువంటి లెటర్స్ అందుకోలేదు. ప్రస్తుతం యూకే మాత్రమే ట్రంప్‌తో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్ ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, ఇతర దేశాలపై 15–-20శాతం సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమెరికా తమ వాణిజ్య భాగస్వాములపై బేస్‌లైన్ సుంకం 10శాతం వేస్తుండగా, ఆసియా దేశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్‌పై 20శాతం, లావోస్, మయన్మార్‌పై 40శాతం విధించింది.