భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను FY29లో చేరుతుందని IMF హెచ్చరించింది. గతంలో ఈ లక్ష్యాన్ని భారత్ 2028 ఆర్థిక సంవత్సరంలోనే చేరుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం దీనిని చేరుకోవటం ఒక సంవత్సరం ఆలస్యంగా మారనుందని తాజా రిపోర్టులో వెల్లడించింది. ఈ తాజా అంచనా నవంబర్ 26న విడుదల అయిన IMF స్టాఫ్ కన్సల్టేషన్ రిపోర్టులో వెల్లడైంది.
ఈ ఆలస్యం భారత గణాంకాల్లో ఉన్న నామినల్ GDP వృద్ధిలో మందగమనంతో పాటు.. డాలర్ తో రూపాయి వేగంగా మారకపు విలువ వేగవంతమైన పతనం మరో కారణంగా ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది. గతంలో FY26లో భారతదేశం 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని, FY28లో 5.15 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా అంచనాల్లో 200 బిలియన్ డాలర్లు వెనుకపడినట్లు వెల్లడైంది.
కొత్త అంచనాలు రూపాయి విలువ తగ్గడాన్ని బట్టి రూపాయి-డాలర్ మారకం రేటును FY25లో రూ. 82.5 నుంచి రూ. 84.6కి, FY26లో రూ. 87కి, FY27లో రూ. 87.7కి పెంపొందించడం ద్వారా రూపాయి విలువ తగ్గినట్లు IMF తెలిపింది. ఈ మార్పులు భారత ఆర్థిక వృద్ధిని డాలర్‌లో తగ్గిస్తున్నాయి. మెుత్తానికి ఈ పరిణామాలు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేరుకునే టైం లైన్‌ని ప్రభావితం చేసింది.
ఇక జీడీపీ విషయానికి వస్తే.. FY26లో భారత నామినల్ GDP వృద్ధిని 8.5%కి తగ్గించబడగా.. FY27 వృద్ధి 10.1% అయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ చెబుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం భారత్ వేగవంతంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని.. దీనికి అధిక అంతర్గత డిమాండ్, నిర్మాణాత్మక మార్పులు కొన్ని కారణాలుగా మారాయి.
