గచ్చిబౌలిలో డ్రోన్ రేసింగ్ షో..దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహణ

గచ్చిబౌలిలో డ్రోన్ రేసింగ్ షో..దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: ఇండియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌‌లో డ్రోన్ రేసింగ్ షో నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియం డ్రోన్ల సౌండ్‌‌‌‌‌‌‌‌తో దద్దరిల్లింది. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం వేదికగా డ్రోన్ డే ఈవెంట్ ప్రారంభమైంది. టూరిజంశాఖ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ షో.. నగర వాసులను ఆకట్టుకుంది. శనివారం కూడా ఈ షో కొనసాగనున్నది.

 ఇప్పటికే టికెట్ల అమ్మకం పూర్తయింది. ఈ డ్రోన్ రేసింగ్ షోలో మొత్తం 8 టీమ్​లు పాల్గొనగా.. 40 మంది ప్రొఫెషనల్ పైలట్లు తమ ప్రతిభను ప్రదర్శించారు.  డ్రోన్లు ఆకాశంలోకి ఎగిరి తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా అద్భుతమైన ఆకారాలను ప్రదర్శించాయి. ఈ అరుదైన షోను తిలకించేందుకు జనం భారీగా తరలొచ్చారు. కాగా, ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే రావాలని  టూరిజంశాఖ ఆఫీసర్లు ప్రకటించారు. 

నేడు ఫైనల్స్​

శుక్రవారం లీగ్ దశ పోటీలు ముగియగా.. శనివారం ఫైనల్స్ జరగనున్నాయి. ఉదయం నుంచే డ్రోన్​ రేసింగ్ ప్రారంభమవుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో స్టేడియానికి చేరుకుంటారు. మారథాన్ డ్రోన్ రేస్ ఫైనల్స్ సాయంత్రం 5 నుంచి 6:30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆర్సీ ప్లేన్ ఎయిర్ షో,  డ్రోన్ సాకర్ ఫైనల్స్, రాత్రి 8 నుంచి 8:30 గంటల వరకు డ్రోన్ రేస్ గ్రాండ్ ఫైనల్స్ ఉంటాయి. రాత్రి 8:30 గంటల తర్వాత విన్నర్లకు మంత్రి జూపల్లి బహుమతులు అందజేయనున్నారు.