ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించిన పీఎం స్వనిధిక్రెడిట్ కార్డ్ దేశంలో ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారుల కోసం రూపొందించిన మొట్టమొదటి ప్రత్యేక క్రెడిట్ కార్డ్. ఇది సాధారణ క్రెడిట్ కార్డుల మాదిరిగా కాకుండా.. యూపీఐతో అనుసంధానించబడిన రూపే కార్డు. వీధి వ్యాపారుల రోజువారీ డబ్బు అవసరాలను తీర్చడమే ఈ కార్డు ప్రధాన ఉద్దేశ్యం.
ఎంత అప్పు వస్తుంది..? క్రెడిట్ లిమిట్ ఎంత..?
ఈ కార్డు కింద క్రెడిట్ లిమిట్ నేరుగా లబ్ధిదారుడు తీసుకున్న లోన్ విడతపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. పీఎం స్వనిధి స్కీంలో మూడు విడతల్లో రుణాలు ఇస్తారు. మొదటి విడతలో రూ.15వేలు, రెండో విడతలో రూ.25వేలు, మూడో విడతలో రూ.50వేల వరకు లోన్ లభిస్తుంది. ముఖ్యంగా రెండో విడత రుణాన్ని తీసుకుని.. సకాలంలో తిరిగి చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కల్పిస్తారు. ఇది రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయం కాబట్టి.. కార్డులో ఉన్న లిమిట్ వరకు డబ్బు వాడుకుని మళ్లీ బిల్లింగ్ సమయంలో తిరిగి చెల్లిస్తే లిమిట్ వరకూ తిరిగి వాడుకునేందుకు వీలుంటుంది.
వీధి వ్యాపారులు ఈ కార్డును ఎలా వాడుకోవచ్చు..?
ఈ క్రెడిట్ కార్డుకు ప్రత్యేకించి యూపీఐ లింక్ ఉండటం వల్ల.. వ్యాపారులు రోజువారీ దుకాణం నడపటానికి చేసే కొనుగోళ్లకు నేరుగా యూపీఐ ద్వారా కార్డు నుంచే పేమెంట్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. దీని ద్వారా జరిపే లావాదేవీలపై ఏడాదికి రూ.1,200 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నెలకు రూ.100 రివార్డ్స్ పొందటానికి పరిమితిగా ఉంది. దీనిని సరిగ్గా ఉపయోగించుకోవటం ద్వారా చిన్న వ్యాపారులకు వడ్డీ భారం లేకుండా తక్షణ పెట్టుబడి లభిస్తుంది.
Also Read : కూరగాయలు, పండ్లు, పాన్ షాపుల వాళ్ల కోసం కొత్త క్రెడిట్ కార్డ్
బ్యాంకుల్లో ఎలా అప్లై చేయాలి..?
పీఎం స్వనిధి లబ్ధిదారులు ఈ క్రెడిట్ కార్డ్ కోసం తమకు లోన్ అందించిన బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.
* ముందుగా పీఎం స్వనిధి పోర్టల్‌లో లేదా మొబైల్ యాప్‌లో తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి.
* రెండో విడత రుణాన్ని సక్రమంగా చెల్లించిన వారు బ్యాంక్ అధికారులకు దరఖాస్తు సమర్పించాలి.
* బ్యాంకులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి, అర్హులైన వారికి రూపే క్రెడిట్ కార్డును జారీ చేస్తాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా ఈ ప్రక్రియకు సంబంధించిన సహాయం పొందవచ్చు. 2030 వరకు ఈ పథకం అందుబాటులో ఉండటంతో కోట్లాది మందికి ఇది మేలు చేయనుంది.
