న్యూఢిల్లీ: విమానాల రద్దు వల్ల ఇండిగో రేటింగ్ నెగెటివ్‌లోకి జారుకునే పరిస్థితి ఏర్పడిందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. కంపెనీ క్రెడిట్ రేటింగ్ (అప్పు చెల్లించే సామర్థ్యం) పట్ల ప్రతికూల వైఖరిని లేదా భవిష్యత్తులో రేటింగ్ పడిపోయే అవకాశం ఉందని సూచించడాన్ని క్రెడిట్ నెగెటివ్ అంటారు. కొత్త రూల్స్ గురించి ఏడాది ముందుగానే తెలియజేసినా ఇండిగో పట్టించుకోలేదని మూడీస్ విమర్శించింది. రీఫండ్‌లు, డీజీసీఏ పెనాల్టీల వల్ల ఇండిగోకు భారీగా నష్టం రావొచ్చు.
కోడ్- షేరింగ్ ఒప్పందాలు అమలుకాక పోవడంతో సంస్థ పేరు దెబ్బతినవచ్చు. ఈ నెల రెండో తేదీ నుంచి ఇండిగో విమానాల రద్దు మొదలైంది. ఐదున 1,600 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. ఫేజ్ 2 ఎఫ్డీటీఎల్ నిబంధనలు గత నెల నుంచి అమలులోకి వచ్చాయి. పైలెట్లకు ఎక్కువ సమయం రెస్ట్ ఇవ్వడం ఇందులోని ముఖ్యమైన రూల్. ఆపరేషన్లను సాధారణ స్థితికి తేవడానికి డిసెంబర్ రెండో వారం వరకు సమయం పట్టవచ్చని ఇండిగో సీఈఓ తెలిపారు.
