న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా విలియం వాల్ష్ నియమితులయ్యారు. 2026, ఆగష్టు 3న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం (మార్చి 31) ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారికంగా వెల్లడించింది. గతంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ చీఫ్‌గా పనిచేసిన వాల్స్.. పీటర్ ఎల్బర్స్ స్థానంలో ఇండిగో నూతన సీఈవోగా అపాయింట్ అయ్యారు. ఇండిగో సంక్షోభం కారణంగా పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
చాలా హ్యాపీగా ఉంది: విలియం వాల్ష్:
ఇండిగోకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఇండిగోకు బలమైన పునాది, గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. సంస్థలోని సహోద్యోగులతో కలిసి పనిచేసి, భాగస్వాములందరికీ సహకారం , సుస్థిరమైన విలువను అందించే సంస్కృతిని నిర్మించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నారు.
విలియం వాల్ష్ నియామకంపై ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా మాట్లాడుతూ.. విలియం వాల్ష్ ఇండిగోకు సారథ్యం వహించనున్నందుకు చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఆయనకు పలు విమానయాన సంస్థలలో పని చేసిన నాయకత్వ అనుభవం ఉందన్నారు.
భారీ స్థాయి విమానయాన కార్యకలాపాలను నిర్వహించడంలో, సంక్లిష్టమైన మార్కెట్ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఆయన దిట్ట అని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటైన ఈ రంగంలో ఆయన నియామకం ఇండిగోకు ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.
