
న్యూఢిల్లీ: ఇండిగో మరో 30 వైడ్-బాడీ ఏ350 విమానాలను ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేయనుంది. దీంతో ఎయిర్ బస్ వద్ద కంపెనీ ఆర్డర్ పెట్టిన ఇలాంటి విమానాల సంఖ్య 60కి చేరింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఇండిగో 30 ఏ350 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదనంగా 70 విమానాలను ఆర్డర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ 70 ఆప్షన్‌లో నుంచి ఇప్పుడు 30 విమానాలకు ఆర్డర్ ఇస్తున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇండిగో 900కి పైగా విమానాల కోసం ఆర్డర్స్ పెట్టింది. వీటిని వచ్చే ఏళ్లలో బోయింగ్, ఎయిర్‌బస్ డెలివరీ చేస్తాయి. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో తన ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లీజ్‌కు తీసుకున్న బోయింగ్ 787 విమానాలతో 10 కొత్త ఇంటర్నేషనల్ సిటీలకు సర్వీస్‌లను నడపనుంది.
ఎయిర్ ఇండియా కూడా అదే బాటలో
టాటా గ్రూప్‌కి చెందిన ఎయిర్ ఇండియా కొత్త విమానాల కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లతో భారీ ఆర్డర్ గురించి చర్చిస్తోంది. సుమారు 200 చిన్న విమానాల కోసం ఆర్డర్ పెట్టొచ్చని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. గతంలో ఇచ్చిన భారీ ఆర్డర్‌కు ఈ ఆర్డర్ అదనం. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, కంపెనీ చిన్న, పెద్ద విమానాలను కొనేందుకు ఆర్డర్ పెట్టొచ్చు. ఎయిర్ ఇండియా 2023లో 470 విమానాలను కొనేందుకు ఎయిర్‌బస్, బోయింగ్‌తో డీల్ కుదుర్చుకుంది. గతేడాది మరో వంద విమానాలను కొనేందుకు ఎయిర్‌బస్‌తో డీల్ కుదుర్చుకుంది.