ఆడబిడ్డల చీర సంబురం..వరంగల్, జనగామ జిల్లాల్లో సర్కారు చీరల పంపిణీ

ఆడబిడ్డల చీర సంబురం..వరంగల్, జనగామ జిల్లాల్లో సర్కారు చీరల పంపిణీ
  • గ్రేటర్​ వరంగల్​లో వర్చువల్‍గా ప్రారంభించి మంత్రి కొండా సురేఖ
  • జనగామలో షురూ చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి

వరంగల్‍/ జనగామ, వెలుగు:  తెలంగాణ కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించింది. శనివారం గ్రేటర్​ వరంగల్​లో మంత్రి కొండా సురేఖ వర్చువల్​గా ప్రారంభించగా, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్​ ఇనగాల వెంకట్రామిరెడ్డి, టెస్కాబ్​ చైర్మన్​ మార్నేని రవీందర్​రావు ఆడబిడ్డలకు అందజేశారు. 

జనగామ జిల్లా కేంద్రంలో భువనగిరి ఎంపీ కిరణ్​కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు పింకేశ్​ కుమార్, బెన్​ షాలోమ్​తో కలిసి చీరల పంపిణీని ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చీరలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. 

మహిళలను ఓనర్లు చేసినం..

చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ వర్చువల్​గా మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పెట్రోల్‍ బంకులు, ఆర్టీసీ బస్సులకు ఓనర్ల చేశామన్నారు. పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా స్వయంసహయక సంఘాలకు ఆర్థిక బాట పట్టించడానికి రుణాలు అందించడమే కాకుండా వ్యాపారాల్లోనూ రాణించేలా యజమానులను చేస్తున్నామన్నారు.

 ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలతో పెట్రోల్‍ బంకులు, సోలార్‍ పవర్‍ యూనిట్లు ఏర్పాటు చేపిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్‍ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

 అర్హులందరికీ సంక్షేమ పథకాల అమలు

పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి అన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్​ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. పేదల దరికి ప్రభుత్వ పథకాలు చేర్చేలా లీడర్లు, అధికార యంత్రాంగం పాటుపడాలన్నారు. పేద మహిళలందరికీ చీరలను అందించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి మాట్లాడుతూ చీరలు మహిళా సంఘం వాళ్లకు మాత్రమే ఇస్తే మిగిలిన ఆడపడచుల మనస్సులు నొచ్చుకుంటాయన్నారు. మిగిలిన వారికి కూడా చీరలు అందించాలని ఎంపీని కోరారు.

వర్ధన్నపేటలో..

వర్ధన్నపేట: వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆఫీస్​లో ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్​ సత్యశారద, టెస్కాబ్​ చైర్మన్​ రవీందర్​రావుతో కలిసి ఇందిర మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.