- స్పెషల్ అట్రాక్షన్‌గా సెర్ప్ స్టాల్
- మహిళా సంఘాల సత్తా చాటేలా ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2047లో మహిళా సాధికారతకు అద్దంపట్టేలా ఇందిరా మహిళా శక్తి స్టాల్ కొలువుదీరనుంది. సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ స్టాల్ సమిట్ కే హైలైట్ గా నిలవనుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు, మంత్రి సీతక్క పర్యవేక్షణలో మహిళా సంఘాలు సాధించిన విజయాలను ఇక్కడ కళ్లకు కట్టనున్నారు. మహిళలే ఓనర్లుగా నడిపిస్తున్న పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన బజార్ల నమూనాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు.
గ్రామీణ మహిళలు గ్లోబల్ స్థాయి బిజినెస్ వుమెన్‌గా ఎలా ఎదిగారో తెలిపేలా స్పెషల్ స్క్రీన్ల ద్వారా డాక్యుమెంటరీలు చూపించనున్నారు. రూ.వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, ఇన్సూరెన్స్ వంటి పథకాలతో ప్రభుత్వం మహిళలకు ఎలా అండగా నిలుస్తుందో ఈ స్టాల్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
