
- 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం: డిప్యూటీ సీఎం భట్టి
- ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతులకు వర్తింపు
- ఐదేండ్లలో 2.10 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి
- 6 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పనకు ప్రణాళిక
- అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభానికి ఏర్పాట్లు
- స్కీమ్‌పై అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: దశాబ్దాల తరబడి పోడు భూముల సాగుకు కరెంటు కోసం ఎదురుచూస్తున్న గిరిజన రైతులకు ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు, గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.12,600 కోట్లతో ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రానున్న ఐదేండ్లలో 2.10 లక్షల పది వేల మంది రైతులకు సంబంధించిన 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం సెక్రటేరియెట్ లో ఇందిరా సౌర గిరి జలవికాసంపై డిప్యూటీ సీఎం ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులో పథకం ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని దానిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం వ్యవసాయానికి విద్యుత్‌సౌకర్యం లేని గిరిజనుల ఒక వరం లాంటిదన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఏకకాలంలో గిరిజనుల భూముల సాగుకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని అన్నారు. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, విద్యుత్తు, ఉద్యానవన శాఖ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజనుల గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లోని భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియాలజికల్ సర్వే చేసి బోర్లు వేయడం, సోలార్ పంపు సెట్లు బిగించడం, ప్లాంటేషన్, డ్రిప్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
అవకడో, వెదురు, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ అంజీర్ వంటి పంటలు సాగు చేసేలా గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గిరిజన రైతులకు అవగాహన కల్పించేందుకు ఇతర రాష్ట్రాల్లో స్టడీ టూర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హిమాచల్ ప్రదేశ్ లో నేచురల్ ఫామింగ్ తో ఆర్గానిక్ కూరగాయలను పండించి ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ చేస్తున్న తరహాలో ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోని ఏజెన్సీ ఏరియాల్లో పండించిన కూరగాయలను హైదరాబాదుకు ఎగుమతి చేసే విధంగా గిరిజన రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అడవులను పెంచుతూనే, గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం విధి విధానాలను ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ డిప్యూటీ సీఎంకు వివరించారు. స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ, డిస్టిక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమ్ పర్చేజ్ కమిటీ, ప్రత్యేకంగా పోర్టల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సందీప్ కుమార్ సుల్తానియా, రఘునందన్ రావు, కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.