ప్రాణం ఉన్నంత వరకు షర్మిలతోనే ఉంటా

ప్రాణం ఉన్నంత వరకు షర్మిలతోనే ఉంటా

హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ ఖండించారు. ఈనెల 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సందర్భంగా షర్మిల పార్టీ వాల్ పోస్టర్‌‌ను నేతలు వాడుక రాజగోపాల్, కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, పిట్టా రాంరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. షర్మిల పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు అదే పార్టీలో ఉంటానని, తనను షర్మిల కుటుంబ సభ్యురాలిగా భావిస్తారని పేర్కొన్నారు. పార్టీలో తనకు ఎటువంటి లోటు లేదని, కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్సార్‌టీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని వివరించారు. 

‘షర్మిలకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి అందరికీ గుర్తింపు ఉంటుంది. చాలా మంది రకరకాలుగా కామెంట్స్ పెట్టారు. నాపై ఒక ప్రముఖ ఛానెల్‌లో చెత్త కథనాలు వేశారు. అవాస్తపు కథనాలను ఖండిస్తున్నా. కావాలనే నన్ను ఇరుకున, ఇబ్బంది పెట్టే కథనాలు ప్రసారం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లకు నా అవసరం ఉంది కాబట్టి వాళ్లు అలా చేస్తున్నారు కావొచ్చు. రేవంత్ రెడ్డికి అవసరం కాబట్టి ఇలా చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే ఊరికే వదిలిపెట్టను. షర్మిలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా. నేను అధికారం కోసం రాలేదు. ప్రజాసేవే నాకు ముఖ్యం. తెచ్చుకున్న తెలంగాణ దగా పడింది. అందుకే షర్మిల పార్టీ. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసేందుకే అంతా షర్మిలకు అండగా నిలిచాం’ అని ఇందిరా శోభన్ పేర్కొన్నారు.