
కూసుమంచి, వెలుగు : అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కూసుమంచి మండలంలో నేలపట్ల, ధర్మతండా గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం తిరుమలాయపాలెం మండలం గోల్‌తండాలో శ్రీభాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగొలు కేంద్రాన్ని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయితో కలిసి ప్రారంభించారు. తర్వాత పాలేరు నియోజకవర్గ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు.
25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యూకోబు, పీఆర్ ఎస్‌ఈ వెంకటరెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్‌బాబు, మార్కెటింగ్ ఆఫీసర్ అలీమ్, ఆత్మ కమిటీ చైర్మన్ శివరామకృష్ణ పాల్గొన్నారు.
అనంతరం కూసుమంచి మండలంలో పెరికసింగారంలో గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన దేవల కొండలరావు భార్యకు రూ.5 లక్షల ఇన్సూరెన్సు చెక్కును అందజేశారు. అలాగే ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, తల్లంపాడులో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట పీఆర్‌ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎస్ఈ యాకుబ్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఉన్నారు.