- విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్, వెలుగు: పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలోని ఇస్లాంనగర్ లో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, ఎంపీడీవో ఆఫీస్‌లో ఇందిరమ్మ మోడల్ హౌజ్‌ను ప్రారంభించారు. అనంతరం వేములవాడ రూరల్ మండల పరిధిలోని కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతున్నామన్నారు.గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప పదేండ్లలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా కట్టించలేదని విమర్శించారు.
రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే ‘మేము ఓట్లు అడగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని ఊరు మేం చూపిస్తాం.. మీరు ఓట్లు అడగొద్దు’ అని సవాల్ విసిరారు. వేములవాడ పట్టణాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, లీడర్లు వకుళాభరణం శ్రీనివాస్, బొజ్జ భారతి, శ్రీనివాస్, సర్పంచులు రంగు వెంకటేశ్, తిరుపతిరెడ్డి, తహసీల్దార్ అబుబాకర్, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
